సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులకు కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. తాజా గా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని నోటీసులు అందుకున్న వారు కూడా ఫీజు చెల్లించక లేకపోతున్నారు. కొందరికీ మైన స్ బ్యాలెన్స్‌తో బిల్లు జనరేట్ కావడంతో… అసలు ఏం జరుగుతుందో దరఖాస్తుదారులకు అంతు చిక్కడం లేదు. ఇక గతంలో ఎప్పుడో చెల్లించిన ఎల్ఆర్ఎస్ ఫీజు రసీదులోని వివరాలతో తాజాగా అప్లికేషన్ పురోగతి తెలుసుకునే వీలు లేకపోవడంతో దరఖాస్తుదారులకు తమ ఇబ్బందుల గురించి ఎవరినీ ఆశ్రయించాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికీ లక్షలాది అప్లికేషన్లకు ఫీజు చెల్లించాలని నోటీసులు రాకపోవడంతో… ఎల్ఆర్ఎస్ ప్రక్రియ గందరగోళంగా మారుతున్నది. అందుబాటులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం తో దరఖాస్తుదారులు చుక్కలు చూస్తున్నా రు. రాయితీ గడువు తేదీ ముంచుకొస్తుండడంతో… ఫీజులు చెల్లించేందుకు, దరఖాస్తుల వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8 లక్షలకు పైగా మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా… ఇందులో కొంతమందికి ఫీజు పేమెంట్ ఇంటిమేషన్ వచ్చింది. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో ఉండగా… ఆయా దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవడం కూడా గగనంగానే మారింది. దీంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుందనేది తెలుసుకోలేక గందరగోళానికి గురవుతున్నారు.
పేమెంట్ లింకులు వస్తున్నా..
ఇక ఫీజులు చెల్లించిన వారికి పేమెంట్ లింకులు వస్తున్నా… వెబ్సైట్ సర్వర్‌లో తలెత్తున్న సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించి… ఈ పరిధిలోనే గతంలో చెల్లించిన ఫీజుల వివరాలు, ప్రస్తుతం ఆ దరఖాస్తుల స్టేటస్ తెలుసుకునే వెసులుబాటుతోపాటు, నిత్యం వస్తున్న సాంకేతిక సమస్యలకు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే… నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించకపోతే రావాల్సిన 25శాతం రాయితీని కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు.
ఆన్లైన్లో కనిపించదు..
ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరిచినట్లు గా అధికారులు చెబుతున్నారు. నిజానికి వివరాలు వెతికే ప్రయత్నం చేస్తే ఏది కనిపించడం లేదు. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన రసీదు నంబర్ ఆధారంగా అప్లికేషన్ సెర్చ్ చేస్తే గనుక తప్పుడు వివరాలంటూ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధం గా జిల్లా, మండలం, గ్రామాల వారీగా, వెంచర్ వివరాలను వెతికినా… ఫలితం శూన్యమే. కనీసం ఫీజులు చెల్లించిన వివరాలు కూడా వెబ్సైట్లో కనిపించకపోవడంతో… తాము చెల్లించిన ఎల్ఆర్ఎస్ ఫీజుతో ప్రాసెస్ చేస్తారా? లేదా అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.