Bonalu Festival | కవాడిగూడ, జూలై 17: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం బోనాల జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాంబశివరావు తెలిపారు. ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనాల మహోత్సవాల ఆహ్వాన పత్రాలను వారు ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతోపాటు దేదీప్యమానమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం, సుగంధ భరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరిస్తామని పేర్కొన్నారు. బాల భోగం అనంతరం అమ్మవారి దివ్యదర్శనం జరుగుతుందని తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటలకు అమ్మవారికి ఋషి పూజ జరిపి బలిహరణ తర్వాత ద్వారవందనం చేస్తామని వివరించారు.
21వ తేదీ సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. బాల భోగం తర్వాత అమ్మవారు రక్తాక్షి అలంకరణలో భక్తులకు ప్రత్యేక దర్శనం ఇస్తుందని పేర్కొన్నారు. సాయంత్రం మూడు గంటలకు గంగ తెప్ప ఊరేగింపు జరిపిన అనంతరం హుస్సేన్ సాగర్ లో గంగాదేవికి పూజలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకు గావు అనంతరం కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించే రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారని వివరించారు. రాత్రి 8 గంటలకు పోతరాజుల విన్యాసాలు, బద్ది పాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. బోనాల మహోత్సవాలకు ఆలయానికి వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. భక్తులు బోనాల జాతర మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని కట్ట మైసమ్మ తల్లి కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు.