Hyderabad | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మహా నగరంలోని నీటి సరఫరాలో లోప్రెషర్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందన్నట్లు… నగరంలో రోజురోజుకీ భూగర్భజలాలు తగ్గిపోవడంతో జలమండలి నీళ్లుకు డిమాండు మరింత పెరుగుతుంది. ఆ ప్రభావం చివరకు కొందరు వినియోగదారులు నేరుగా నల్లాలకే మోటార్లు పెట్టి నీళ్లు లాగేసేందుకు దారి తీస్తున్నది. దీంతో ఆ కొందరి పాపం… మిగిలిన అందరికీ శాపంగా మారుతున్నది. ఒక్క మోటారు చుట్టుపక్కల పదుల సంఖ్యలోని ఇండ్లల్లో లోప్రెషర్ కారణమవుతుంది.
ఇలా… జలమండలి పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా మోటార్లు పెడుతుండటంతో లోప్రెషర్ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది లోప్రెషర్ ఫిర్యాదుల అంతకంతకూ పెరుగుతుండటం జలమండలికి పెను సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో జరిమానాలతో కట్టడి చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి కార్యాచరణ మొదలుపెట్టారు. దీని ద్వారా ఫిర్యాదులు తక్కువై ఫలితాలనిస్తే ప్రజలకూ ఈ యాప్‌ను విస్తరించాలని యోచిస్తున్నారు. మరి… రానున్న మే నెలలో భూగర్భజలాల స్థాయి మరింత లోతునకు పడిపోనున్న దరిమిలా లోప్రెషర్ సమస్య తీవ్రమవుతుందా? జలమండలి కట్టడి ఫలితాలనిచ్చి తగ్గుముఖం పడుతుందా? అనేది కీలకంగా మారింది.
హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది నెల ముందుగానే ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరవ్యాప్తంగా భూగర్భజలాల నీటిమట్టం మరింత లోతునకు పడిపోయింది. హైదరాబాద్ జిల్లాలో గత ఏడాది మార్చిలో 9.75 మీటర్ల స్థాయిలో ఉన్న భూగర్భజలాలు ఇప్పుడు 10.10 మీటర్లకు పడిపోయాయి. మేడ్చల్ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ గత ఏడాది మార్చిలో 12.45 మీటర్లలోతున్న ఉంటే ఇప్పుడు ఏకంగా 14.60 మీటర్ల లోతుల్లోకి పోతేగానీ భూగర్భజలాలు అందేలాలేవు. రంగారెడ్డిలోనూ ఇప్పుడు 12.59 మీటర్ల లోతున జలాలు అందుబాటులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో రెండు నెలల కిందటే బోర్లు ఎండిపోవడంతో జనం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి జలమండలి ట్యాంకర్లు రెట్టింపు స్థాయిలో ఏర్పాటు చేసినా డిమాండు తీరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు నీటి వ్యాపారం కూడా జోరందుకుంటున్నది. అయితే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతుండటం జలమండలి నీటి సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. బోర్లు ఎండిపోయిన చోట ట్యాంకర్ నీటిని తెచ్చుకోలేక… జలమండలి నీటి సరఫరా జరుగుతున్న సమయంలో నేరుగా నల్లాలకే మోటార్లు బిగిస్తున్నారు. సాధారణంగా గృహాల్లో అర అంగుళం మోటార్లు ఎక్కువగా వినియోగిస్తారు.
కానీ కొన్నిచోట్ల ఏకంగా రెండు అంగుళాల మోటార్లు పెట్టి మరీ నల్లా నీటిని నేరుగా గుంజుతున్నారు. ఇలా కొందరు చేయడంతో చుట్టుపక్కల ఉన్న గృహాలు లోప్రెషర్‌తో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికి అసలు నీటి సరఫరానే నిలిచిపోతున్నది. దీంతో జలమండలికి ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2022 నుంచి పరిశీలిస్తే ఫిబ్రవరి, మార్చి నెలల్లో నెలకు 1000-1500 వరకు ఉండే లోప్రెషర్ ఫిర్యాదులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 2800కు పైగా నమోదు కాగా… మార్చి నెలకొచ్చే సరికి దాదాపు రెట్టింపుస్థాయిలోకి పెరిగి నాలుగువేల మైలురాయిని దాటడమంటే క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
మే నెలలో కచ్చితంగా భూగర్భజలాల స్థాయి మరింత లోతునకు పడిపోవడమనేది సాధారణమే. కేవలం జలమండలి నీటిపైనే ఆధారపడే కుటుంబాల సంఖ్య మరింత పెరగనున్నది. వీళ్లు కూడా నీటి కోసం నల్లాలకు మోటార్లను అమర్చే ప్రయత్నాలు చేస్తే లోప్రెషర్ సమస్య జఠిలం కానున్నది. ఇప్పుడు జలమండలికి లోప్రెషర్ సమస్య అనేది హైటెన్షన్ రేపుతున్నది. అయితే అధికారులు యాప్‌తో క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. 700కు పైగా కేసులు నమోదయ్యాయి. భూగర్భజలాలు మరింత లోతునకు పడిపోయి ఎండిపోయిన బోర్ల సంఖ్య పెరుగుతుంది.
అప్పుడు కొందరు జలమండలి నీటినే మోటార్లతో గుంజే పరిస్థితి ఎక్కువయ్యే ప్రమాదముంది. అయితే జలమండలి అధికారులు తీసుకుంటున్న చర్యలతో మోటార్లు పెట్టేందుకు వినియోగదారులు జంకుతారా? అనేది ఈ నెల ముగిసేనాటికి నమోదయ్యే లోప్రెషర్ ఫిర్యాదుల సంఖ్యతో తేలనుంది. ఒకవేళ ఇది సత్ఫలితాన్నిస్తే కీలకమైన మే నెలలో లోప్రెషర్ సమస్యను నియంత్రించేందుకు ప్రజల చేతికి కూడా యాప్‌ను ఇచ్చి నల్లాలకు నేరుగా మోటార్లు పెట్టకుండా కట్టడి చేయాలని యోచిస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.