Omega Hospital | కొండాపూర్ : క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ తదితర ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తించి.. చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన లాంజ్విటీ లాంజ్‌ను బుధవారం గచ్చిబౌలిలోని ఒమేగా దావఖానాలో ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఒమేగా దవాఖాన వ్యవస్థాపకులు డాక్టర్ మోహన వంశీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఏటా వ్యాధి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేవలం క్యాన్సర్ వ్యాధి కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్, సంతానలేమి సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఇలాంటి సమస్యలను ముందస్తుగానే గుర్తించి తగిన చికిత్సను అందించవచ్చన్నారు.
జన్యుపరమైన పరీక్షల ద్వారా కొన్ని నెలల ముందుగానే రాబోయే వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన చికిత్సను అందిస్తే ఎంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాంటి చికిత్స కోసం దేశంలోనే తొలిసారిగా లాంజ్విటీ లాంజ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం మనిషి ఉమ్మి ద్వారా జన్యుపరమైన పరీక్షల నిర్వహించి.. భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. తద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్, సంతాన లేమి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. శరీరంలో చోటు చేసుకునే మార్పులను సైతం ముందుగానే గుర్తించవచ్చన్నారు. లాంజ్విటీ లాంజ్‌తో మూడు వారాల్లోనే భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలను కచ్చితంగా గుర్తించవచ్చన్నారు. కార్యక్రమంలో జెనిసిస్ట్ డాక్టర్ రాబర్ట్, హనుమంతరావు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.