Jalamandali | సిటీబ్యూరో, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ ) : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మళ్లీ ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల మొదటి నుంచి ఈ పథకం అమల్లోకి రాగా 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించకుండా ఉన్న వారికి ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించే సువర్ణ అవకాశాన్ని కల్పించింది.
జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ అమలు చేయాలని జలమండలి గత నెల ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం అందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఓటీఎస్ కింద వినియోగదారులు తమ బకాయిలను చెల్లించవచ్చు. ఈ పథకం అక్టోబరు నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. జలమండలిలో గతంలో రెండు సార్లు ఈ వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీంను బీఆర్ఎస్ హయాంలో 2016, 2020లో ఆమలు చేశారు.