జూబ్లీహిల్స్, అక్టోబర్14: యూసుఫ్‌గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్‌లో రోడ్డు తవ్వివదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పెద్దయ్య పిండిగిర్ని సమీపంలో రూ.24 లక్షల వ్యయంతో కొత్తరోడ్డు వేసేందుకు ఉన్న రోడ్డును తవ్వారు. అంతేకాకుండా తవ్విన వ్యర్థాలతో రోడ్డును రెండు వైపులా మూసివేశారు. ఇకతెల్లారితే రోడ్డు పడుతుందేమోనని స్థానికులు ఎదురుచూస్తుండగానే 3 నెలలు గడిచిపోయాయి.
రోడ్డు పనులు ప్రారంభించిన సమయంలో కనిపించిన గుత్తేదారు మళ్లీ కనపడలేదు. దీంతో స్థానికులకు నడకే నరకయాతనగా మారింది. వర్షాలకు మ్యాన్‌హోల్స్ మూసుకుపోయి డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ సంతోష్‌ను వివరణ కోరగా కాంట్రాక్టర్‌కు ఇప్పటికే 2 సార్లు నోటీసులిచ్చామని తెలిపారు. పనులు చేపట్టకపోతే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు.