శంషాబాద్ రూరల్, జూన్ 13 : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న డబ్బాలు(దుకాణాలు)పై మున్పిల్ అధికారులు ప్రతాపం చూపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య డబ్బాలను కూల్చివేశారు. బాధితులు ఎంత వేడుకున్నా కనికరించకుండా తొలగించారు. ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ధనవంతుల కోసం ఇదంతా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సాతంరాయి గ్రామంలో ఓ గేటెడ్ కమ్యూనిటీ ఉన్నది. అందులోని విల్లాలను ధనవంతులు, ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అధికారులు కొనుగోలుచేసి ఉంటున్నారు. ఈ కమ్యూనిటీ ప్రహరీ పక్క నుంచే ఉన్న రోడ్డు నుంచి గ్రామానికి వెళ్తుంటారు.
ఈ రోడ్డు పక్కనే నిరుపేదలు డబ్బాలు( దుకాణాలు) ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే.. ప్రహరీకి ఆనుకుని డబ్బాలు ఉండడంతో కొంతమంది వాటిని తొలగించాలని శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు వందలాది మంది పోలీసులను తీసుకువచ్చి నిరుపేదలు వేసుకున్న డబ్బాలను తొలగించి.. జీవనోపాధిపై దెబ్బకొట్టి, రోడ్డున పడేశారని బాధితులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులతీరుపై స్థానిక నాయకుడు, మాజీఉప సర్పంచ్ భవానీ మల్లేశ్, మాజీ ఎంపీటీసీ జల్లపల్లి నరేందర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. గత పదేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్న మాపై ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.
50ఏండ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న మాకు కనీసం ఇంటి జాగకూడా లేదు. మేము బతకడం కోసం చిన్నడబ్బాలు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. సడన్‌గా వచ్చి అధికారులు మా డబ్బాను కూల్చివేశారు. మాకు ఏ దిక్కులేదు. తమను ఆదుకోవాలి.
– సుకన్య, స్థానిక మహిళ