Damagundam | వికారాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒకపక్క స్థానికుల నిరసనలు.. మరో పక్క పర్యావరణ వేత్తల హెచ్చరికలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మారలేదు.. ఎవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల చెట్లు నరికివేస్తారని, అడవి నామరూపాలు లేకుండా పోనున్నదని స్థానికులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రేడియేషన్ ప్రభావంపై భయపడుతున్నా సమాధానమిచ్చేవారే లేరు. ఈ ప్రాజెక్టు వల్ల ఈసీ, మూసీ నదులు ఉనికి కోల్పోతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు.
పదేండ్ల క్రితమే రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెండింగ్లో పెట్టింది.. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం 2900 ఎకరాల అటవీ భూములను నేవీకి అప్పగించింది.. ఈ భూముల్లో లక్షా 93 వేల చెట్లతోపాటు 400 ఎకరాల్లో గడ్డి భూములు ఉన్నాయి. వీటితోపాటు 500 ఏండ్లనాటి దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయం.
లక్షల కోట్ల విలువైన ఔషధ మొక్కలు, 258 రకాల పక్షిజాతులు ఉన్నాయి. రక్షణశాఖ అవసరాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ అడవిని నరికివేసి ప్రకృతి విధ్వంసం చేయడాన్ని తాము నిరసిస్తున్నామని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోర్టుకు వెళ్లి అడ్డుకుని తీరుతామని ‘సేవ్ దామగుండం’ పేరిట ఉద్యమం చేస్తున్న దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ సభ్యులు తెలిపారు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోతే అనేక రూపాల్లో నిరసనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల రేడియేషన్తో రాబోయే తరాలకు అన్యాయమే. వాతావరణం కలుషితమై వ్యాధులొస్తాయని మేధావులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అమెరికా వంటి దేశంలో రాడార్ను తొలగించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకొప్పుకున్నది. రాడార్ నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఊరుకునేది లేదు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాబోవు రోజుల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబుతాం.
– చాకలి బుచ్చయ్య, పూడూరు గ్రామం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాగోగులను ఆలోచించి రాడార్ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు వచ్చాయి. పూడూరు, తిర్మలాపూర్, గూడుపల్లి, టేకులబిడ్ తండా, సోమన్గుర్తి తదితర గ్రామాల ప్రజలు ఈ అడవిలో మేకలు, పశువులను మేపుకొంటూ జీవనం కొనసాగిస్తాం. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు రద్దు కోసం తెగించి కోట్లాడుతాం.
– సీహెచ్ పాండు, పూడూరు గ్రామం
చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధిని కల్పించే అడవిని నరికి మా పొట్టకొట్టొద్దు. నేవీ రాడార్ స్టేషన్ మాకొద్దు.. బరాబర్ కొట్లాడుతాం. ఈ ప్రాంతాన్ని కలుషితం చేసి మా ప్రాణాలమీదకు తీసుకొస్తరా.. కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకిచ్చింది. ప్రజలను పట్టించుకోరా.. ఎంతో పురాతనమైన దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం ఏమి కావాలె. లక్షల చెట్లను నరికివేసి మమ్మల్ని రోగాలపాలుజేస్తరా.
– రాంచంద్రయ్య, పూడూరు గ్రామం
రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో నేవీ రాడార్ నిర్మాణం వద్దే వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై చింత లేదు. రోగాలబారిన పడితే ఎలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు తీస్తాయా..? నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి.
– పీ సతీశ్ పంతులు, పూడూరు గ్రామం