వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్‌పై అవగాహన
వెండింగ్ కమిటీసమావేశంలో డీసీ వేణుగోపాల్
అంబర్‌పేట, మే 31: వీధి వ్యాపారులకు లాభం చేకూర్చేలా డిజిటల్ పేమెంట్స్‌పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తే అదనంగా బ్యాంకుల ద్వారా మరింత ఎక్కువ మొత్తం రుణం మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు వీధి వ్యాపారులకు అవగాహన కల్సించాలని సర్కిల్ డీసీ వేణుగోపాల్ సభ్యులకు సూచించారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం డీపీవో రజిత, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాయిబాబా, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో డీసీ మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో ఎక్కడెక్కడ వీధి వ్యాపారులు రూ.10వేలు, రూ.20వేలు రుణం తీసుకొని తిరిగి చెల్లించారో వారికి మరో దఫా ఎక్కువ రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రుణం తీసుకొని ఇంకా చెల్లించని వారిని వెంటనే చెల్లించేలా చూడాలని, వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రధానంగా వీధి వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ పై దృష్టి సారించేలా వారికి చెప్పి అందుకు కావాల్సిన ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం వంటి ద్వారా పేమెంట్స్ తీసుకోవడం చేస్తే నెలకు రూ.100 వారికి ఇన్సెంటివ్ వస్తుందని, సంవత్సరానికి రూ.1200లు వారి ఖాతాలో జమ అవుతాయని వారికి తెలియజెప్పాలని సూచించారు. ఈ ఇన్సెంటివ్ను రూ.500లకు పెంచే యోజన ఉందని పేర్కొన్నారు. వారికి కావాల్సిన క్యూఆర్ కోడ్‌ను ఇప్పించాలని చెప్పారు. గోల్నాక కూరగాయల మార్కెట్లో ఉన్న వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, అందుకు డీపీవో, టౌన్‌ప్లానింగ్, ట్రాఫిక్ సిబ్బంది వెళ్లి క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇవ్వడం జరుగుతుందని నిర్ణయించారు. సర్కిల్ పరిధిలో మొత్తం 1968 మంది వీధి వ్యాపారులు రుణం తీసుకున్నారని, ఇందులో 384 మంది రెండో విడత కూడా రుణం పొందారని చెప్పారు. డీపీవో రజిత మాట్లాడుతూ ఇప్పటికే మొదటి విడత, రెండో విడత తీసుకున్న రుణం చెల్లించిన వారికి ఎక్కువ మొత్తంలో రుణం ఇప్పించడానికి బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నామని వివరించారు.