ఖైరతాబాద్, ఏప్రిల్ 8 : ఏవో కారణాలతో చేతులు పనిచేయకపోయినా.. శరీరం నుంచి తొలగించినా.. మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. అచేతనంగా మారుస్తుంది. అలాంటి వారికి రోటరీ డిస్ట్రిక్ట్ 3150 కొత్త ఆశ కిరణాన్ని అందిస్తున్నది. రోడ్డు ప్రమాదాలు….విద్యుదాఘాతాలు….పుట్టుకతో….ఇతర కారణాలతో చేతులు కోల్పోయిన వారికి ఎల్ఎన్4 బిలో ఎల్బో మెకానికల్ ఫంక్షనల్ హ్యాండ్స్ (ప్రొస్తెటిక్ హ్యాండ్)ను ఉచితంగా అందిస్తూ దివ్యాంగులుగా మారిన వారికి వెలుగు రేఖలు పంచుతున్నది. ఆ వివరాలను రోటెరియన్, ఎల్ఎన్4 గ్లోబల్ అంబాసిడర్ కేవీ మోహన్ కుమార్, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ కె. ప్రభాకర్, కో కన్వీనర్ వాల్మీకి హరికిషన్, ప్రాజెక్టు చైర్మన్ డీఎన్ గౌరీలు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఎల్ఎన్4 హ్యాండ్స్ ప్రత్యేకత..
యూఎస్ఏకు చెందిన ఎల్లెన్ మీడోస్ ప్రొస్తెటిక్ హ్యాండ్ ఫౌండేషన్ ఈ కృతిమ చేతులను రూపొందిస్తున్నది. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఆ ఫౌండేషన్ భాగస్వామ్యంతో వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నది. జైపూర్‌లో కృతిమ అవయవాలు అందుబాటులో ఉన్నా….అవి అలంకారంగా మాత్రమే ఉంటాయి. వాటితో పనులు చేసుకోవడం, బరువులు ఎత్తడానికి వీలుండదు. కానీ ఎల్ఎన్4 హ్యాండ్స్ బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంజెక్షన్ మోల్డెడ్ ప్లాస్టిక్, అల్యూమినియం, ఇత్తడి, స్టీలుతో రూపొందించిన ఈ చేతులతో వస్తువులను పట్టుకోవడంతో పాటు వాటికి వేళ్ల ఆకారంతో ఉన్నప్రత్యేక అమరికతో పెన్నులు, పెన్సిళ్లు పట్టుకోవచ్చు. 400 గ్రాముల బరువు ఉన్న ఈ చేతితో సుమారు 4.45 కేజీల బరువును సునాయాసంగా ఎత్తవచ్చు.
ఎలాంటి వారు అర్హులు….
మొచేతి నుంచి కింద వరకు కనీసం 14 సెంటీమీటర్ల చేయి ఉండాలి. ఎనిమిదేండ్ల వయసు నుంచి ఆపై ఉన్న వారందరూ వేసుకోవచ్చు. ప్రత్యేకమైన పౌచ్ కలిగి ఉన్న ఈ చేతిని 30 సెకన్లలో అమర్చుకునే వీలు ఉంది. వాటర్ రెసిస్టెంట్ పరికరం కావడంతో నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. వేడిని సైతం తట్టుకుంటుంది.
28న మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉచితంగా పంపిణీ
80 దేశాల్లో ఇప్పటి వరకు 68వేలు, భారతదేశంలో 24వేల ఎల్ఎన్4 మెకానికల్ హ్యాండ్స్‌ను ఉచితంగా పంపిణీ చేశాం. 28న దూలపల్లి మైసమ్మగండిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 400 మందికి ఉచితంగా ఈ హ్యాండ్స్‌ను అందించనున్నాం.
– కేవీ మోహన్ కుమార్, ఎల్ఎన్4 గ్లోబల్ అంబాసిడర్
డ్రాయింగ్ అంటే ఇష్టం
మితా, మింటూ మా అమ్మానాన్న. తుకారాంగేట్‌లో ఉంటున్నాం. విద్యావాణి హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నాన్న రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తారు. నాకు పుట్టుకతోనే కుడి చేయి మొచేయి కింద వరకు లేదు. ఏ పనైనా చేసుకోవాలన్నా, రాయాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎల్ఎన్4 హ్యాండ్ వేసుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాను. పెన్నుతో రాయగలుతున్నాను. నాకు ఇష్టమైన డ్రాయింగ్ కూడా వేస్తున్నాను.
– డి. పల్లవి
పోలీస్ కావాలని ఉంది
మాది సైదాబాద్‌లోని కుర్మగూడ. హరిప్రసాద్, స్వరూప అమ్మానాన్నలు. కుర్మగూడ లిటిల్ స్టార్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం జూలైలో ఇంటి పై అంతస్తులో ఫ్లోర్ క్లీనింగ్ స్టిక్ చేతిలో పట్టుకొని పైకి లేపిన క్రమంలో అక్కడే ఉన్న హైటెన్షన్ వైరుకు తగిలి షాక్ కొట్టింది. నా కుడి చేయి మొచేతి కింది వరకు పూర్తిగా కాలిపోయింది. డాక్టర్లు చేయిని తొలగించారు. రోటరీ క్లబ్ వారు ఎల్ఎన్4 ప్రొస్తెటిక్ హ్యాండ్ను ఉచితంగా అందించారు. ప్రస్తుతం ఆ చేతితో రాయడమే కాదు… ఆహారాన్ని సైతం తీసుకుంటున్నా. ఈ హ్యాండ్‌తో నా చేయి మళ్లీ తిరిగి వచ్చినట్లయ్యింది. బాగా చదువుకొని పోలీస్ కావాలని ఉంది.
– సారంగ్ చాణక్య, కుర్మగూడ