సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 4: ఉస్మానియా దవాఖాన చరిత్రలోనే మొట్ట మొదటి సారి అధునాతన ఛాతీ గోడ దిద్దుబాటు శస్త్ర చికిత్సలను నిర్వహించడం అభినందనీయమని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. ఉస్మానియా దవాఖానలో కార్డిథోరాసిక్, వాస్కులర్ సర్జరీ హెడ్ డాక్టర్ అనితా భల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఓజీహెచ్ ల్యాండ్‌మార్క్ లైవ్ పెక్టస్ దిద్దుబాటు శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజారావు.. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాఖేష్ సహాయ్, యూకే నేషనల్ పెక్టస్ గ్రూప్ అధిపతి, అంతర్జాతీయ అధ్యాపకులు డాక్టర్ శ్యామ్ కోల్వేకర్, డాక్టర్ అనితా భల్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లో నిర్వహించిన లైవ్ పెక్టస్ శస్త్ర చికిత్సలను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. ఇలాంటి లైవ్ వర్క్‌షాప్‌లు యువ వైద్యులలో మరింత నైపుణ్యం, అవగాహన పెంచేందుకు దోహదం చేస్తాయని అన్నారు.
పెక్టస్ అనేది సరిదిద్దగల రుగ్మత..
యూకే నేషనల్ పెక్టస్ గ్రూప్ అధినేత డాక్టర్ శ్యామ్ కోల్వేకర్ మాట్లాడుతూ.. ఇలాంటి శస్త్ర చికిత్సలు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంప్రదాయ బద్దంగా నిర్వహించవచ్చని, 12 సంవత్సరాల వయస్సు తర్వాత శస్త్ర చికిత్స దిద్దుబాటు ఉత్తమంగా సూచించబడుతుందని అన్నారు. పెక్టస్ అనేది సరిదిద్దగల రుగ్మత అని డాక్టర్ అనితా భల్లా పేర్కొన్నారు.
ఉస్మానియా దవాఖానలో మినిమల్లీ ఇన్వేసివ్ రిపేర్ అఫ్ పెక్టస్ ఎక్స్కావాటం(క్రియో అబ్లేషన్‌తో నస్ ప్రోసీజర్)కూడా మొదటిసారి నిర్వహించడం జరిగిందని అనస్థీషియా హెచ్‌వోడీ డాక్టర్ అభిమన్యు సింగ్ పేర్కొన్నారు. రెండవ రోజు కాడవెరిక్ హ్యాండ్స్ ఆన్ శిక్షణ అనుకరణపై చెన్నైకు చెందిన డాక్టర్ రాజ్‌కమల్ విష్ణు దృష్టి సారించారు. సిమ్యులేషన్ వర్క్‌షాప్‌లను నిర్వహించేందుకు సహకరించిన డీఎంఈ, ఓఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు, సూపరి ంటెండెంట్ డాక్టర్ రాజారావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ ఎల్ఎం డార్లాంగ్, డాక్టర్ కేఆర్ బాల సుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు.