సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్తో.. ఆ ప్రభావం అనుబంధ రంగాలపై కూడా పడుతోంది. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వెబ్సైట్లలో వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో మాదిరి కస్టమర్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా కూర్చొన్న చోటకే తీసుకువచ్చే రియాల్టీ వెబ్సైట్లకు ఆదరణ లేకుండా పోతున్నది.
మార్కెట్లో క్రయవిక్రయాలు తగ్గిపోవడంతో.. ఓపెన్ ప్లాట్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల లిస్టింగ్ నగరంలో క్రమంగా తగ్గుతుండగా.. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వెబ్సైట్లలో నమోదయ్యే స్థిరాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నది. ఒక్క ఏడాదిలోనే 30 శాతం లిస్టింగ్ పడిపోగా.. గడిచిన మూడు నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా ఉందని నిర్వాహకులు వాపోతున్నారు.
రియాల్టీ రంగంలో అమ్మకాలు పడిపోవడం ఎంతో మంది జీవనాధారంపై, మరెన్నో రంగాలకు ఉపాధి లేకుండా పోతున్నది. హైదరాబాద్ కేంద్రంగా 10లక్షల మందికిపైగా ఆధారపడి ఉన్న ఈ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనోపాధి పొందుతుండగా.. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ప్రాపర్టీ లిస్టింగులతో ఆదాయాన్ని పొందే ఎన్నో సంస్థలకు ఇదొక సమస్యగా మారింది.
తమ వెబ్సైట్లలో ప్రాపర్టీలను లిస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడంతోపాటు, లావాదేవీ విజయవంతమైతే వచ్చే కమిషన్ కూడా కోల్పోతున్నారు. నగరంలో దెబ్బతిన్న గిరాకీతో బడా కంపెనీలు కూడా ప్రాపర్టీ వెబ్సైట్లను ఆశ్రయించడం లేదు. గతంలో వందలాది మంది మార్కెటింగ్ సభ్యులను కలిగి ఉన్నా సంస్థలు కూడా.. వెబ్సైట్ల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షించేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో వెబ్సైట్లకు ఆదరణ కూడా తగ్గిపోతున్నది. ముఖ్యంగా ప్రాపర్టీలను ఆయా వెబ్సైట్లలో నమోదు చేసే ప్రక్రియ భారీగా తగ్గిపోతున్నది.
నిజానికి వెబ్సైట్లను ఆశ్రయించి లిస్టింగ్ చేసే కంపెనీలు కూడా సంబంధిత నిర్వాహకులకు నెలవారీగా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో నెల, త్రైమాసికం, అర్థ వార్షిక, వార్షిక విధానంలో సబ్స్క్రిప్షన్ ఫెసిలిటీతో రియాల్టీ సేవలను ఆయా వెబ్సైట్లు కంపెనీలకు అందిస్తాయి. ఒకసారి లిస్ట్ చేసిన తర్వాత సంబంధిత ప్రాపర్టీకి యునిక్ ఐడీతో క్రయవిక్రయాలను చేసే వీలు ఉండగా… ఒక ప్రాపర్టీని అందుబాటులో ఉన్న వెబ్సైట్లలో నమోదు చేసుకునే వీలు ఉంటుంది. కానీ మార్కెట్లో క్రయవిక్రయాలు లేక లిస్టింగ్ కూడా తగ్గిపోతుండటం రియల్ అమ్మకాల తీరును స్పష్టం చేస్తున్నాయి.
నగరంలో ప్రస్తుతం 8కిపైగా కంపెనీలు ప్రధానంగా రియాల్టీ సేవలను అందిస్తున్నాయి. ఇందులో అన్నింట్లోనూ భారీ స్థాయిలో లిస్టింగ్ పడిపోతున్నట్లుగా తేలింది. ఇక ఇప్పటికే నమోదు చేయబడిన ప్రాపర్టీలకు కూడా లీడ్ జనరేషన్ తక్కువే ఉంటుందని వెల్లడైంది. అయితే కంపెనీలు అధికారికంగా ధ్రువీవీకరించడానికి నిరాకరిస్తుండగా… తగ్గిన లీడ్స్ 30 శాతానికి పైగా ఉంటుందని మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్ విషయంలో తమ వెబ్‌సైట్‌ను ఆశ్రయించే వారి సంఖ్య వేలల్లో ఉండగా… ఆన్లైన్లో వెతుక్కునే కొనుగోలుదారులు భారీగా తగ్గిపోయారని, ఇక స్థిరాస్తి యజమానులు కూడా లిస్టింగ్‌కు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే లిస్టింగ్ చేసిన వారు కూడా నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా మార్కెట్లో ఉన్న సంక్షోభమే కారణమని స్పష్టం చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం కేవలం వెస్ట్ సిటీలో టూ లెట్లు, ఓపెన్ ప్లాట్లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, కమర్షియల్ స్పేస్ లిస్టింగ్ డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.