సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు, ఆర్సీ పురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శనివారం సీపీ ఉత్తర్వులు జారీచేశారు.
మెదక్ – నిజామాబాద్ – అదీలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గాల్లో జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లను మభ్యపెట్టకుండా ఈ నెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు కొల్లూరు, ఆర్సీపురం ఠాణాల పరిధిలో కల్లు కంపౌండ్లు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఠాణా పరిధిలోని క్లబ్బులు, పబ్బులు, స్టార్ హోటల్స్ల్లో సైతం మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, మద్యం సరఫరాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.