సిటీబ్యూరో: ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం దుకాణాలు మినహా మిగతా వ్యాపార సముదాయాలు తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం.. పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. రెండు నెలలుగా ట్రాక్‌లోకి వస్తున్న శాంతి భద్రతలు.. తిరిగి ఎలా మారబోతున్నాయనే ఆందోళన వారిలో నెలకొంది.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు రోజు రోజు కూ దిగజారాయి. సెల్‌ఫోన్ స్నాచింగ్ మాఫియాకు తోడు.. అర్ధరాత్రి రౌడీషీటర్లు, వారి ప్రత్యర్థుల హత్యలు, ప్రతీకార దాడులతో నగరం అట్టుడుకింది. అధ్వానంగా శాంతి భద్రతలు మారా యంటూ తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు అర్ధరాత్రి ఆపరేషన్లు మొద లు పెట్టారు.
ఇందులో భాగంగా సెల్‌ఫోన్ స్నాచర్లపై కాల్పులు జరపడం, దుకాణాలను రాత్రి 10 నుంచి 11 గంటల వరకు మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో లాఠీలకు పనిచెప్పి.. విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా, ప్రభుత్వం అర్ధరాత్రి ఒంటి గంట వరకు దుకాణాలు తెరుచుకోవచ్చంటూ.. ఆదేశాలు జారీ చేయడంతో గత పరిస్థితి తిరిగి పునరావృతం అయ్యే ప్రమాదం ఉన్నదన్న ఆందోళన పోలీసు వర్గాల్లో నెలకొంది.