జూబ్లీహిల్స్, ఆగస్టు 4 : ఉపరితల ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం మూసాపేట్ సర్కిల్ బాలాజీనగర్ పీహెచ్సీ సెంటర్ ప్రాంతంలో 1.63, కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో 1.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 30.8, కనిష్ఠం 24.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 71 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కలెక్టర్ పర్యవేక్షణలో మూడు దశల్లో..
మేడ్చల్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. అందులో భాగంగా త్వరలోనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రణాళికలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మూడు దశల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను చేపట్టనున్నారు. క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత ఉన్నతాధికారులకు నివేదికలను సమర్పించనున్నారు.
నేటి నుంచి స్వచ్ఛదనం-పచ్చదనం
సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ కార్యక్రమాలను నిబద్ధతతో చేపట్టాలన్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన భూమిక పోషించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా విభాగాల అధికారులు ప్రజలతో మమేకమై కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సూచనలు, భాగస్వామ్యంతో నగరం నిరంతరంగా పరిశుభ్రత, పచ్చదనంతో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
‘సీజనల్’ నివారణకు వైద్య శిబిరాలు
నేటి నుంచి 15వ తేదీ వరకు
సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధుల నివారణకు సోమవారం నుంచి 15 తేదీ వరకు మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. 108 వార్డుల్లోని 495 కాలనీల్లో ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే జోనల్, డిప్యూటీ కమిషనర్లు షెడ్యూల్ ప్రకారం హెల్త్ క్యాంపు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.