ఖైరతాబాద్ : పుట్టిన రోజు ఘనంగా సంబురాలు జరుపుకోవడం గొప్ప విషయం కాదని, పుట్టుకకు సార్థకత చేకూర్చు కునే పనులను చేసినప్పుడే జీవన సాఫల్యం లభిస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.
మంగళవారం డాక్టర్ వకుళాభరనం 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు, బీసీ కమిషన్ సభ్యులతో కలిసి ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తాను తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటినట్లు తెలిపారు.
మొక్కలు మన జీవనాధారమని, వాటిని నాటడం మన జీవన విధానంలో సంప్రదాయం కావాలన్నారు. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శాలువా, పూలబోకేలతో శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్, ఓఎస్టీ తులసీ రామ్, జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.