ఖైరతాబాద్, ఫిబ్రవరి 24: ద్వాపర యుగమంతా కృష్ణ భగవానుడి పర్వమే. అందులో శ్రీకృష్ణుని లీలలకు బృందావనం ప్రప్రథమ వేదిక. బృందావనంలో కృష్ణుడి విన్యాసాలను కథలు కథలుగా చెబుకుంటూనే ఉన్నాం. శ్రీకృష్ణుడు తన బాల్యంలో వెన్నను దొంగిలించినట్లు భాగవతం చెబుతుంది. యశోదమ్మకు తెలియకుండా దొంగిలించిన వెన్నను ఆ బృందావనంలోని ఓ వృక్షపు ఆకు డొప్ప/దొన్నెలో దాచినట్లు చెబుతారు. ఆ ఆరుదైన వృక్ష జాతిని నేడు ‘కృష్ణ మర్రి మొక్క’ లేదా ఆంగ్లంలో ‘కృష్ణాస్ బటర్ కప్’గా పిలుస్తున్నారు. దీని ఆకులు సహజంగా దొన్నెలా ఉండటంతో బాలకృష్ణుడు వెన్నను అందులో దాచినట్లు చెబుతారు. ఈ అరుదైన మొక్కలు పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళాలలో దర్శనమిచ్చాయి. వేల వేల పుష్ప జాతులు, పూలు, పండ్లు, ఇండోర్, ఔట్ డోర్ మొక్కలతో సాగర తీరం ప్రకృతి వనంగా మారింది. ఆ విశేషాలు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకం.
హైదరాబాద్ అడేనియమ్స్ స్టాల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఔట్ డోర్లో పెట్టుకునే అడేనియమ్స్, క్యాక్టస్ ప్లాంట్స్ లాంటివన్నీ బోన్సాయ్ రూపంలో పెరుగుతాయి. తక్కువ నీటిని సంగ్రహించి ఎక్కువ కాలం జీవిస్తాయి. ముళ్లతో కూడిన క్యాక్టస్ ప్లాంట్స్‌కు ప్రతి ఏడాదికోసారి పూలు పూయడం విశేషమని చెప్పుకోవచ్చు. సుమారు 350 రకాల మొక్కలు, 25 రకాల క్యాక్టస్ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
గ్రాండ్ నర్సరీ మేళా.. ఈ స్టాల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. నిర్వాహకుడు కె.ఆనంద్ అరుదైన మొక్కలను అందుబాటులోకి తీసుకువచ్చారు. శివుడికి ప్రీతిపాత్రమైన ఏక బిల్వం, మహా బిల్వం, ఏక ముఖి రుద్రాక్ష, నల్ల పసుపు, బ్లాక్ బెర్రీ, టర్కీ అంజీర్‌తో పాటు వైవిధ్యమైన జామ చెట్టు, దాని ఆకుల వాసన జామ ఆకుల్లా, పండు మాత్రం స్ట్రాబెర్రీ రుచి కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీ జామ పేరుతో ఉన్న ఈ మొక్క ఓ విచిత్రమే అని చెప్పొచ్చు. ఎర్ర జామ, బనానా మ్యాంగో, తెల్ల నేరేడు చెట్లు అందుబాటులో ఉన్నాయి.
పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు, సకల జీవకోటికి ప్రాణాధారంగా మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో గురువారం ఏర్పాటు చేసిన 11వ గ్రాండ్ నర్సరీ మేళాను వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ జంట నగరాలు కాంక్రీట్ వనంగా మారిన తరుణంలో ఇలాంటి మేళాలు మానువుడిని ప్రకృతి వైపు నడిపిస్తాయన్నారు. ఉదయాన్నే లేచి కిచెన్, రూఫ్ గార్డెనింగ్‌లు చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తాయని ఆయన తెలియజేశారు.
‘బ్రీత్ హెల్తీ.. స్టే హల్తీ…’ నినాదంతో బల్కంపేటకు చెందిన యువ ఎంట్రప్రెన్యూయర్ టి.ప్రణీత్ గౌడ్ బయో డీగ్రేడబుల్ పాట్స్‌ను రూపొందించడంతో పాటు దాని పేటెంట్ హక్కులు సైతం పొందారు. మహిళా సాధికారతే లక్ష్యంగా సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తూ వైవిధ్యమైన కోకో పిట్ (కొబ్బరి పీచు)తో రూపొందించిన కుండీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో ఎలాంటి మట్టి ఉపయోగించకుండానే కేవలం కోకో పిట్లో మొక్కలను పెంచుకోవచ్చు. నీళ్లు సైతం ఎక్కువగా పోయాల్సిన అవసరం లేకుండా స్ప్రే చేస్తే సరిపోతుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కుండీలను రూపొందించినట్లు ప్రణీత్ తెలిపారు.
పాత టెలిఫోన్.. కారు… బస్సు…. జంతువులు…. మనిషి ముఖాలను పోలిన కుండీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నారాయణగూడకు చెందిన పి.శ్రీనివాస్ తన ఇంటినే వనంగా మార్చుకొని ప్లాంట్స్ డాట్ ఇన్ పేరుతో కుటీర పరిశ్రమను నెలకొల్పి స్వచ్ఛమైన మట్టి, సిరామిక్‌తో కళాత్మకంగా వివిధ రకాల కుండీలను రూపొందిస్తున్నారు. కన్న కొడుకు దివ్యాంగుడు కావడంతో అతనికి ఇంట్లోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని వీటిని తయారు చేస్తూ అందులో మొక్కలను పెంచుతున్నట్లు శ్రీనివాస్ వివరించారు.
పగలు, రాత్రి తేడా లేకుండా ఇంట్లో లైట్లు వేస్తుంటారు. రాత్రి వేళల్లో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. అలాంటి తరుణంలో పూర్తిగా సహజమైన విద్యుత్‌తో ఒక గదికి సరిపడా వెలుతురును ఈ సోలార్ లాంతర్ అందిస్తుంది. పగటి పూట ఎండలో పెడితే, రాత్రి వేళల్లో వీటి వెలుగులను ఉపయోగించుకోవచ్చు. నాలుగైదు గంటలు ఎండలో ఉంచితే బెడ్ ల్యాంప్‌గా 12 గంటలు, మామూలు బల్బులా ఏడు గంటల పాటు వెలుగునిస్తుంది.
మట్టి, ప్లాస్టిక్, సిరామిక్, కోకో పిట్ లాంటి కుండీల సరసన స్మార్ట్ గ్రో బ్యాగ్స్ నిలిచాయి. టెక్స్టైల్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన ఈ బ్యాగుల్లో పూలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు పండించుకోవచ్చు. తక్కువ నీటితో ఎక్కువ కాలం మిద్దె, పెరటి తోటలను పండించేందుకు వీలుగా వీటిని రూపొందించారు. 6X3 నుంచి 18X18 ఇంచుల సైజు వరకు అందుబాటులో ఉన్నాయి. ఐదేండ్ల వరకు వీటి మన్నిక ఉంటుందని చెబుతున్నారు.