కాప్రా, డిసెంబర్ 22: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి మున్ముందు జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు అన్నారు. జ్యూట్ బ్యాగులను తయారు చేయడంతో పాటు ఈ రంగంలో వందలాదిమందికి శిక్షణ ఇచ్చి.. వారు స్వయం ఉపాధి పొందే విధంగా తీర్చిదిద్దిన కాప్రా సాయిరాంనగర్కు చెందిన మహిళ దేవి ఆధ్వర్యంలో గురువారం కాప్రా జిల్లా పరిషత్ హైస్కూలుకు చెందిన 800 మంది విద్యార్థులకు ఉచితంగా జ్యూట్ బ్యాగులు, మాస్కులు, పాఠశాలకు శానిటైజర్లను అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. జ్యూట్ పరిశ్రమను, జ్యూట్ బ్యాగుల తయారీని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కాప్రాకు చెందిన మహిళ దేవి స్వయం ఉపాధి కింద జ్యూట్ బ్యాగుల తయారీని ప్రారంభించి.. ఈ రంగంలో ఎంతో మందికి శిక్షణ ఇవ్వడం అభినందనీయమనిఅన్నారు. జ్యూట్ బ్యాగుల తయారీదారు దేవి మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పొందే మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జ్యూట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ నర్సింహులు, ఉప్పల్ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు మహేశ్, కొండల్గౌడ్, కొప్పులకుమార్, గిల్బర్ట్, బంక వెంకటేశ్, మచ్చపాండు, మల్లారెడ్డి, సరోజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.