సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): మొహర్రం, బీబీ కా ఆలం ఊరేగింపును ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో భాగంగా అన్ని శాఖల అధికారుల సమన్యయంతో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మొహర్రం సందర్భంగా మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో ఆయా శాఖల అధికారులు, ఓల్డ్‌సిటీ ఎమ్మెల్యేలు, షియా ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. మొహర్రం ఊరేగింపులో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడటంతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, విశ్వప్రసాద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.