సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వరద ముంపు నివారణకు తీసుకుంటున్న ఎస్ఎన్డీపీ పథకం ఆదర్శనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు చెందిన తొమ్మిది మందితో కూడిన ఐఏఎస్ల బృందం కొనియాడింది. నగరానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈవీడీఎం సేవలు, పారిశుద్ధ్య సేవలను గురువారం తొలిరోజు అధ్యయనం చేశారు. రెండవ రోజు శుక్రవారం ఎల్బీనగర్ జోన్లో పర్యటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన రెవెన్యూ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు చీఫ్ సెక్రెటరీ, ఐఏఎస్ సుధీర్గార్గ్, వైస్ చైర్మన్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రవీంద్ర ప్రతాప్ సాహీ, వారణాసి మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి సిపు గిరి, గోరఖ్పూర్ మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి గౌరవ్ సింగ్ సోగర్వాల్, గోరఖ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ సంజయ్ చౌహాన్, ఘజియాబాద్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ విక్రమాదిత్య సింగ్, లక్నో మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఇంద్రజీత్ సింగ్, లక్నో అదనపు మున్సిపల్ కమిషనర్ అరవిందరావు, ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ అశీష్ శర్మ, తదితరులు ఎల్బీనగర్ జోన్లోని నాగోలు, బండ్లగూడ ప్రాంతాలతో పాటుగా ఎల్బీనగర్ సర్కిల్లో నిర్మిస్తున్న వరదనీటి కాలువలను పరిశీలించారు. వీరికి జీహెచ్ఎంసీ సమగ్ర నాలా అభివృద్ధి పథకం చీఫ్ ఇంజినీర్ కిషన్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ఇతర అధికారులు వరదనీటి ముంపు నివారణకు ఎస్ఎన్డీపీలో భాగంగా నిర్మించిన పనులను చూపించడంతో పాటు వస్తున్న ఫలితాలను వివరించారు. 2020 అక్టోబరు నెలలో నగరంలో కురిసిన కుండపోత వర్షాలు, ఆ సమయంలో వరద నీటి కష్టాలపై జోనల్ కమిషనర్ పంకజ వివరించారు. ఎస్ఎన్డీపీ పనులు పూర్తయిన ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కుండపోత వర్షాలు కురిసిన వరద ముంపు సమస్య తలెత్తలేదని, వరద నీటి నివారణ చర్యలు బాగున్నాయని యూపీ ఐఏఎస్ బృందం అభినందనలు తెలిపారు.