హైదరాబాద్: గత వారం పదిరోజులుగా మంచిరేవుల నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతపులి (Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్కులో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పడింది. దీంతో దానిని మరికాసేట్లో అధికారులు జూపార్కుకు తరలించనున్నారు. రెండు రోజుల క్రిత గోల్కొండ తారామరతి మిలటరీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న అటవీ భూమిలోకి ప్రవేశిస్తుండగా.. మంచిరేవుల అటవీ పార్కులోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత చిక్కిన విషయం తెలసిందే. దీంతో అధికారులు ఫారెస్ట్ టెక్ పార్కులో బోనులతోపాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కాగా, చిలుకూరి జింకల పార్కు, గ్రేహౌండ్స్ క్యాంపస్, పోలీస్ అకాడమీ, గోల్కొండ మిలటరీ కేంద్రం, మంచిరేవుల అటవీ ప్రాంతం అన్నీ కలిపి సుమారు 20 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం అటవీ వాతావరణాన్ని పోలి ఉండడంతో చిరుత స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఈ క్రమంలో గత గురువారం తెల్లవారుజామున చిరుత పులిని చూసినట్లు గ్రేహౌండ్స్ క్యాంపు సమీపంలో చూసినట్లు పోలీసులు కానిస్టేబుళ్లు వెల్లడించారు. అది సంచరిస్తున్న ప్రాంతాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో గ్రేహౌండ్స్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినా చిరుత ఆచూకీ లభించకపోవడంతో దానిని పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో ఏడు బోన్లు, 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.