చిక్కడపల్లి, మార్చి 22 : పెట్టుబడిదారుల మార్కెట్ ప్రయోజనాల కోసం ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు.. ప్రపంచ సుందరి పోటీలను రద్దు చేయాలని, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బాగ్ లింగంపల్లిలో వీరనారి ఐలమ్మ ట్రస్ట్ భవనం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ సుందరి పోటీలను మే 7న ప్రారంభించి మే 31న గ్రాండ్ ఫినాలేతో ముగించనున్నట్లు, విభిన్నమైన కళావారసత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని, అంతర్జాతీయ వేడుకలకు హైదరాబాద్ వేదిక అవుతున్నందుకు ఆనందంగా ఉన్నదని పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి (ఐఏఎస్) అధికారి స్మిత సబర్వాల్ మాట్లాడటం విచారకరం అని అన్నారు. ఈ పోటీలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే, మరొపక్క దేశంలో, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం, మహిళలపై హింస పెరుగుతున్నది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పాలకులు అంతర్జాతీయ వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
కాస్మో టిక్స్ వస్తువులను అమ్ముకోవటం కోసం తప్ప మరొకటి కాదు. మహిళలు అనేక రంగాలలో విద్యా, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు పోతూ విజయాలు సాధిస్తుంటే మహిళల వ్యక్తిత్వం, గౌరవం, స్త్రీల యొక్క ఔన్నత్త్యాన్ని పెంచే విధంగా విధి విధానాలు రూపొందించాలి. కానీ మహిళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా ఇప్పటి సినిమాలలో అశ్లీలంగా చూపిస్తూ స్త్రీలను అంగడి సరుకుగా, వ్యాపార వస్తువుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడాన్ని రద్దు చెయ్యకపోతే ఐద్వా ఆధ్వర్యంలో వివిధ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.ఎన్. ఆశలత, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.