సిటీబ్యూరో: పందేండ్ల కిందట అదృశ్యమైన పన్నెండేండ్ల బాలుడి ఆచూకీని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు ట్రేస్ చేశారు. బాలుడి ఆధార్‌కార్డులో ఫోన్ నంబర్‌ను ఇటీవల ఛేంజ్ చేయడంతో దాని ఆధారంగా బాలుడిని గుర్త్తించినట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయెల్ వెల్లడించారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే మహ్మద్ ఖలీల్ ఘోరీ 12 ఏండ్ల వయస్సులో ఆగస్టు, 18, 2014లో అదృశ్యమయ్యాడు.
ఈ కేసు ఇన్నాండ్లు ట్రేస్ కాకపోవడంలో యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ పరిశీలనకు వెళ్లింది. అయితే బాలుడు అదృశ్యమైనప్పుడు అతడి ఆధార్‌కార్డు నంబర్ ఉన్నట్లు చిన్న ఆధారం పోలీసులకు లభించింది. అయితే ఆధార్ నంబర్‌కు సంబంధించిన వివరాలు ఇటీవల అప్డేట్ చేసి అందులో మొబైల్ నంబర్ ఇచ్చారు. ఆ మొబైల్ నంబర్ యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగిదని తేలడంతో తెలంగాణ పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేశారు. 2014లో బాలుడు రైళ్లో యూపీకి వెళ్లాడు.. కాన్పూర్ రైల్వే స్టేషన్లో తిరుగుతుండగా రైల్వే పోలీసులు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. అక్కడ 2022 వరకు ఆ బాలుడు అక్కడే ఉన్నాడు.
2022లో ప్రభుత్వ ఉద్యోగి సనేహిసింగ్ దత్తతకు తీసుకొని అతడి పేరును అభినవ్ సింగ్‌గా మార్చుకున్నాడు. ఈ మేరకు అతడి ఆధార్‌లోనూ పేరు మార్చి, కొత్తగా అతడి ఫోన్ నంబర్‌ను యాడ్ చేశాడు. ఆ ఫోన్ నంబర్ మార్చడంతో పోలీసులు బాబును గుర్తించి ఈ కేసును ఛేంజ్ చేశారు. 22 ఏండ్ల వయస్సుకు వచ్చిన అతడికి కంచన్‌బాగ్‌లోని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అలాగే నాచారంలోని శాంతిసాదన్ హోం నుంచి 2015లో అదృశ్యమైన 11 ఏండ్ల బాలికను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ పోలీసులు నిజామాబాద్‌లో ట్రేస్ చేశారు. ఆమె సాయిబతార్ అనే వ్యక్తిని పెండ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు ఉన్నట్లు గుర్తించారు. చాంద్రాయణగుట్టకు చెందిన బాలిక 2017లో అదృశ్యం కాగా ఇటీవల ఆమెను బెంగళూర్‌లో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.