ఉస్మానియా యూనివర్సిటీ/ కాచిగూడ, జూన్ 22: నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థి సంఘాలతోపాటు పలువురు నేతలు బగ్గుమన్నారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నగరంలో రాస్తారోకోలు నిర్వహించి.. నిరసనలు, ర్యాలీలు, ధర్నా చేపట్టారు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరాహార దీక్షకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట దీక్షకు దిగిన ఆయనకు ఓయూ అధ్యాపకులు ప్రొఫెసర్ కాసిం, డాక్టర్ కొండా నాగేశ్వర్రావు నిమ్మరసం అందించి, దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. నీట్ ఫలితాలు విడుదలై నేటికి 18 రోజులు గడుస్తున్నా కేంద్రప్రభుత్వం లీకేజీకి పాల్పడిన దోషులను శిక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ వైఖరితో దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ అవకతవకల్లో బీజేపీ ఎంపీల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష నిర్వహణను ఎన్టీఏ నుంచి సీబీఎస్‌కు అప్పగించాలన్నారు. దీక్షలో నెల్లి సత్య, వినయ్, సాయిగౌడ్, సుమన్‌గౌడ్, మోతీలాల్‌నాయక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నీట్ పరీక్ష అవకతవకలపై విచారణ జరిపించి.. రద్దు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీవైఎల్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వీజేఎస్ విద్యార్థి సంఘాలు బర్కత్‌పురలోని కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి నేతృత్వంలో వివిధ సంఘాల విద్యార్థులను అరెస్ట్ చేసి, వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
నీట్ పరీక్ష లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీట్ లీకేజీలు జరిగాయని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. నీట్ పరీక్ష లీకేజీ, అవకతవకలపై విచారణ జరిపి, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ వివిధ బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆయన.. బర్కత్‌పుర సర్కిల్లో విద్యార్థులతో ధర్నాతో పాటు ర్యాలీని నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేసి,లీకేజీలకు కారణమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. జాతీయ కన్వీనర్ కృష్ణ, జాతీ య ఉపాధ్యక్షుడు సత్యం, వెంకటేశ్, రాజేందర్, నందగోపాల్, అనంతయ్య, రామకృష్ణ, సురేశ్ పాల్గొన్నారు.