ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14: ఉస్మానియా యూనివర్సిటీ బారికేడ్లు, ముళ్లకంచెలను తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్లతో ఓయూ మెయిన్ లైబ్రెరీ నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా పరిపాలన భవనానికి చేరుకున్నారు. విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ధర్నాకు దిగారు. కొంతమంది విద్యార్థులు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఓయూలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ నియంతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్ర త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వేదికైన ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎటువంటి సమావేశాలు, సభలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారని దుయ్యబట్టారు.
మరోపక్క యూనివర్సిటీలో అశాస్త్రీయంగా అన్ని కోర్సుల ఫీజులు పెంచి, పేద, మధ్య తరగతి విద్యార్థులకు చదువును దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే వర్సిటీలో మౌలిక సదుపాయాలు లేకుండా పూర్తిస్థాయిలో శాశ్వత ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా పరిపాలన భవనం చుట్టూ ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారని అన్నారు. మరోపక్క ఎన్నో ఏళ్లుగా వర్సిటీలో పనిచేసిన కార్మికులను తొలగించి, వారి స్థానంలో అధిక మొత్తం చెల్లించి ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నారని ఆరోపించారు. గతంలో పలుమార్లు ముళ్లకంచెలు, బారికేడ్లను తొలగించాలని విన్నవించిన పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వాటిని తామే తొలగించేందుకు ప్రయత్నించామన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14: ఉస్మానియా యూనివర్సిటీలో విద్య అభివృద్ధి కోసం నూతన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఓయూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం గతంలో ఓయూ స్టూడెంట్ ఎజెండా రూపొందించామని గుర్తు చేశారు. దాని అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్యూ జాతీయ నాయకుడు నాగేశ్వరరావు, ఓయూ అధ్యక్షుడు సుమంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టూడెంట్ ఎజెండా అమలు కోసం పీడీఎస్యూ దశలవారీగా ముందుకు పోతుందని తెలిపారు. మొదటి దశలో ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని చెప్పారు.
ఓయూలో మెస్ డిపాజిట్ల విధానం రద్దు చేసి ఉచిత మెస్ వసతి కల్పించాలని అన్నారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ మంజూరు చేయాలన్నారు. ఓయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడంతో పాటు ఓయూ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు, రాష్ట్రబడ్జెట్లో విద్యారంగానికి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఓయూలోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు వర్సిటీలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రుక్మత్ పాషా, సంపత్, మహేశ్, క్రాంతి, సంతోష్, సుమన్, నరేశ్, మధు, శ్రీకాంత్, యశ్వంత్, విజయ్ పాల్గొన్నారు.