సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి బెంగుళూర్‌కు హైదరాబాద్ మీదుగా భారీ ఎత్తున్న హాష్ అయిల్ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా రూ. 1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ అయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. బుధవారం ఎల్బీనర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు.
ఏపీలోని అల్లూరిసీతారామరాజు జిల్లా, కిన్నెరలోయ గ్రామానికి చెందిన పంగి కేశవరావు అలియాస్ కేశవ్ గతంలో డ్రగ్స్ దందా చేస్తుండగా అనాకపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని చిన్ననాటి స్నేహితుడు ఆర్టీఏ ఏజెంట్ అయిన కృష్ణకు అక్రమంగా డ్రగ్స్‌ను రవాణా చేయడంపై పట్టుంది. ఏపీ, ఒడిశాల నుంచి హైదరాబాద్, బెంగుళూర్ ఇతర ప్రాంతాలకు ఈజీగా డ్రగ్స్‌ను రవాణా చేసే మార్గాలను ఎప్పకటిప్పుడు తనకున్న పరిచయాలతో తెలుసుకుంటాడు.
గంజాయి కిలోల కిలోలు తీసికెలితే ఎక్కడో ఓ దగ్గర పట్టుబడుతున్నారని, భారీ ఎత్తున గంజాయి తీసికెళ్లడం కూడా కష్టంగా మారిందని, పోలీసుల నిఘా పెరిగిందని గుర్తించారు. దీంతో 40 కిలోల గంజాయితో ఒక కిలో చొప్పున హాష్ అయిల్ తయారు చేస్తుంటారు, ఇలా తయారు చేసిన హాష్ అయిల్ను చిన్న మొత్తాలలో ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు ఫ్లాన్ చేశారు. ఇందులో బాగంగా ఒడిశాకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ అయిన జయరాం ఖీముందును తమతో కలుపుకున్నారు.
బెంగుళూర్‌కు 20 కిలోల హాష్ అయిల్ను సరఫరా చేసేందుకు ఫ్లాన్ చేశారు. ఇందులో భాగంగా కృష్ణ 20 కిలోల హాష్ అయిల్ను కేశవ్, జయరాంకు అప్పగించాడు. దీంతో ఇద్దరు కలిసి బుధవారం ఉదయం హైదరాబాద్ శివారు చేరుకున్నారు, ఓఆర్ఆర్ సమీపంలోని పెద్దఅంబర్‌పేట్, సంపూర్ణ హోటల్ సమీపంలో బెంగుళూర్ నుంచి దానిని తీసికెళ్లేందుకు వస్తున్న వారి గూర్చి ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి బృందాలు ఆ కేశవ్, జయరామ్‌లను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడంతో 20 కిలోల హాష్ అయిల్ లభ్యమయ్యింది.
దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ఆర్టీఏ ఏజెంట్ కృష్ణ, బెంగుళూర్ నుంచి వచ్చే పార్టీల కోసం గాలింపు చేపట్టారు. కాగా, గంజాయి, హాష్ అయిల్ హైదరాబాద్‌లోకి రాకుండా ఉండేలా కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతుందన్నారు. ఎక్కడైనా పార్టీలు, స్థానిక యువత గంజాయి ఇతర డ్రగ్స్ వాడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఇంఛార్జీ డీసీపీ మనోహర్, ఎస్ఓటీ అదనపు డీసీపీ షఖీర్ హుస్సేన్, ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, అశోక్‌రెడ్డిల బృందాన్ని సీపీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు.