వనస్థలిపురం, ఏప్రిల్ 29 : అధిక వడ్డీ ఆశచూపి సామాన్యుల వద్ద లక్షల్లో దండుకుని, సుమారు రూ.25 కోట్ల వరకు కొల్లగొట్టిన బద్దం జ్యోతిరెడ్డిని పోలీసులు రిమాండ్కు తరలించారు. కమలానగర్లో నివాసముండే జ్యోతిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని, తనకు డబ్బులు ఇస్తే అధిక వడ్డీతో తిరిగి ఇస్తామని నమ్మబలికింది. తనకున్న పరిచయాలను వాడుకోవడంతోపాటు, కొత్త పరిచయాలు ఏర్పరుచుకుని మరీ డబ్బులు తీసుకుంది. గత రెండు నెలలుగా పలువురు బాధితులు వనస్థలిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కాగా జ్యోతిరెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా హడావిడిగా మంగళవారం అర్ధరాత్రి అమెను రిమాండ్కు పంపడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బద్దం జ్యోతిరెడ్డి బాధితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. తమ స్వంత డబ్బులతో పాటు స్నేహితులు, బంధువుల వద్ద కూడా తెచ్చి ఆమె చేతిలో పెట్టారు. కొందరైతే ఇంట్లో ఆడవాళ్ల బంగారాన్ని కూడా తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టారు. అన్నీ తీసుకుని ఉడాయించి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయిందని, పోలీసులు అర్ధరాత్రి ఆమెను రిమాండ్ చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల నిందితురాలి తమ్ముడు సుష్మా థియేటర్ వద్ద ఉన్న ఓ బ్యాంకు నుంచి బంగారం తీసుకెళ్లుందుకు యత్నించగా బాధితులు అడ్డుపడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెబుతున్నారు. తమ వద్ద వసూలు చేసిన డబ్బు, బంగారం జ్యోతిరెడ్డి వద్దనే ఉందని, పోలీసులు ఆమె వద్ద నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రిమాండ్కు వెళ్లిన ఆమెను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డబ్బులు ఇచ్చినవారు చేస్తున్న వత్తిడి తట్టులేకపోతున్నామని, రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు లబోదిబోమంటున్నారు.