ఎల్బీనగర్, ఏప్రిల్ 4: మధుయాష్కీ ఓ టూరిస్ట్ లీడర్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శించారు. కొన్ని రోజులు ఢిల్లీలో.. కొన్ని రోజులు అమెరికాలో ఉండి.. కొన్ని రోజులు ఎల్బీనగర్లో రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మధుయాష్కీ అడపాదడపా వచ్చే టూరిస్టు నాయకుడని, ఇది ప్రజా సేవనే కాదని విమర్శించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు తాను ప్రారంభోత్సవాలు చేయెద్దనే ఉద్దేశంతోనే మధుయాష్కీ గౌడ్ ఇంచార్జి మంత్రిచేత ప్రారంభోత్సవాలు చేయిస్తానంటున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. పెద్ద శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి చేతుల మీదుగా చేయాలని, చిన్న పనులకు కూడా మంత్రులు వస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని అన్నింట్లో ప్రారంభోత్సవాలకు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి ప్రారంభోత్సవాలకు వస్తారా అని ప్రశ్నించారు. మధుయాష్కీకి నియోజకవర్గంపై అవగాహన లేదని, చిన్న పార్కులు పూర్తయినా కూడా వాటిని ప్రారంభించకుండా తాళాలు వేసి పెట్టడాన్ని తాము ప్రశ్నించడంతోనే మంత్రి పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
ఈనెల 7వ తేదీన మంత్రి ప్రారంభోత్సవానికి వస్తారని చెబుతున్నారని, ఇది మంచి పరిణామమేనని తాము ఆగుతున్నామని, అలా కాకుండా వాయిదా పడితే మాత్రం తాము ఆయా పనులను ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొందరు నాయకులు, కొందరు కార్పొరేటర్లు ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేయవద్దన్న ఉద్దేశ్యంతో ఉన్నారని అన్నారు. గత కొన్ని రోజుల పాటు తనకు అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరంగా ఉండటంతోనే ఈ డ్రామాలు ఆరంభం అయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ నిధులకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు అందరికీ హక్కు ఉంటుందని, అయితే పనులను మంజూరు చేయించే సత్తా ఉన్న నాయకులకే పేరు వస్తుందని అన్నారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేసిన పనులను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టగానే మన్సూరాబాద్ డివిజన్లోని కొందరు నాయకులు తామే ఆ పనులు మంజూరు చేయించామంటూ కాపీ పేస్టులు పెట్టుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీల అక్రమ కలయికే ప్రోటోకాల్ రగడకు కారణం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అక్రమ కలయికే ప్రోటోకాల్ రగడకు కారణమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ప్రోటోకాల్ పేరుతో మాట్లాడుతున్న కార్పొరేటర్ల తీరు ఏంటో త్వరలో తాము తమ పీఏ ఫోన్లో మాట్లాడిన సంభాషణలు వింటే తెలుస్తుందని అన్నారు. గతంలో ఏనాడు కూడా కార్పొరేటర్లు లేకుండా శంకుస్థాపనలు గానీ, ప్రారంభోత్సవాలు గానీ చేశామా అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ నిధులే కాకుండా హెచ్ఎండీఎ, జలమండలి నిధులు తాను మంజూరు చేయించినా కార్పొరేటర్లతో కలిసి ప్రారంభోత్సవాలు చేశామని, ఇప్పుడు మా నిధులు అంటూ మాట్లాడటంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు లేని ప్రోటోకాల్ ఇప్పుడు ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. శిలాఫలకాల్లో మంత్రి పేరుతో పాటుగా ఎమ్మెల్యే పేరు కూడా ఉంటుందంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అయితే తనకు శిలాఫలకాల సోకు లేదని, అందుకే అర్బాటం, అట్టహాసం లేకుండా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తానని అన్నారు. మధుయాష్కీకి శిలాఫలకాల సోకు ఉన్నందునే ఇలా చేస్తున్నాడని విమర్శించారు.
మధుయాష్కీ గౌడ్ ఎక్కువ నిధులు తెచ్చాడని నిరూపిస్తే రాజీనామా చేస్తా
ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధే జరగలేదని, తాను ఈ ఏడాది కాలంలో ఎక్కువ నిధులు తెచ్చానని మధుయాష్కీ గౌడ్ అంటున్నారని, ఆర్టీఐ ద్వారా వివరాలు తెప్పించి తన కన్నా ఎక్కువ నిధులు తెచ్చినట్లుగా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సుధీర్‌రెడ్డి సవాలు విసిరారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఫ్లై ఓవర్లు త్వరితగతిన జరగడంలో తాను నిత్యం మానిటరింగ్ చేయడంతోనే సాధ్యమైందని తెలిపారు. అదే సమయంలో ఆరంభం అయిన పలు ప్లై ఓవర్ల పని ఇప్పటికీ నత్త నడకన సాగుతున్నాయని అన్నారు. కార్పొరేటర్ సుజాతా నాయక్ విషయంలో కొర్టు పరిధిలో, మహిళా కమిషన్ పరిధిలో వివాదం ఉన్నందున తాను మాట్లాడబోనని చెప్పారు. తనను ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ చీవాట్లు పెట్టినట్లుగా మధుయాష్కీ తప్పుగా మాట్లాడుతున్నారని, అసలు రాహుల్ గాంధీనే మధుయాష్కీకి చీవాట్లు పెట్టారన్నారు. పోటీ చేసి ఓడిపోయినందున తమ పరువు పోయిందని బాధ పడ్డారన్నారు.
నీ అయ్య అనే పదం వాడితే ఊరుకోనూ
తన గురించి మధుయాష్కీ నీ అయ్య సొమ్మా అంటూ మాట్లాడారని, నీ అయ్య అనే పదం వాడటం మంచిది కాదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. మొదటిసారి చెప్పినందున విజ్ఞతతో అవకాశం ఇస్తున్నానని, మరోసారి ఈ వాఖ్యలు చేస్తే తాను మధుయాష్కీ ఇంటి వద్దకే వెళ్లి అంతకంతకూ తీవ్ర విమర్శలు చేస్తామన్నారు. చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఇలాగే చేస్తే తగిన బుద్ది చెబుతామన్నారు. మధుయాష్కీకి స్కూటర్ ఉన్నప్పుడు సుధీర్‌రెడ్డి ఎక్కడున్నాడంటూ వాఖ్యానించారని, అయితే తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1985లోనే తనకు స్కూటర్ ఉన్నదని, 1986లోనే తాను జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అయ్యానని, 1987లోనే తాను అమెరికా వెళ్లానని తమ బంధువులు అప్పటికే అమెరికాలో ఉన్నారని సుధీర్‌రెడ్డి అన్నారు. తాను దొంగ వీసాలు ముద్రించి వెళ్లలేదన్నారు. తాను రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా విజయం సాధించానని, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు పర్యాయాలు గెలిచి ప్రజా సేవలో ఉన్నానని అన్నారు. 2004లో ఎంట్రీ ఇచ్చి డబ్బిచి టిక్కెట్టు కొనుగోలు చేసి నిజామాబాద్‌లో గెలిచిన తర్వాత అక్కడ సేవ చేయకుండా ఇక్కడికి దిగుమతి అయిన నాయకుడు విమర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కీ లాంటి బ్లాక్ మెయిలర్ల నుండి ప్రజలను కాపాడేందుకే తాను ఉన్నానన్నారు.