LB Nagar | మన్సురాబాద్, ఏప్రిల్ 17 : ఏడాదిన్నర క్రితం అర్ధాంతరంగా నిలిచిపోయిన డ్రైనేజీ ట్రంకులైన్ పనులను పునరుద్ధరింప చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. మనసురాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని స్వాతి రెసిడెన్సి వద్ద ఏడాదిన్నర క్రితం ఆగిపోయిన యుజిడి పనులను ప్రారంభం చేస్తున్న తరుణంలో సదరూ ప్రాంతాన్ని ఆయా కాలనీవాసులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిలిచిపోయిన ట్రంక్ లైన్ పనులు పూర్తయితే బాలాజీ నగర్ ఫేజ్ టు, లక్ష్మీ భవాని కాలనీ, టీ నగర్, కెవియన్ రెడ్డి కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, అంజలి రెసిడెన్సి, స్వాతి రెసిడెన్సి, లక్ష్మీ ప్రసన్న కాలనీ, ఆదర్శనగర్, పవనగిరి, ఎల్లారెడ్డి ఫేజ్ టు కాలనీల ప్రజల మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ట్రంకు లైను ప్రైవేటు వ్యక్తుల భూముల నుంచి వెళ్లాల్సి ఉండడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రైవేటు భూమికి చెందిన వ్యక్తులతో పలు దఫాలుగా చర్చించడంతో వారు తమ భూమి నుంచి ట్రంకులైను వెళ్లేందుకు అనుమతిచ్చారన్నారు. ట్రంక్ లైన్ నిర్మాణ సమయంలో ఎత్తు పల్లాలను చూసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి మురుగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, నాయకులు పోచబోయిన జగదీష్ యాదవ్, చంద్రారెడ్డి, నర్సింగ్ గౌడ్, అనిల్ కుమార్, నాగార్జున రెడ్డి, జలమండలి అధికారులు రాజు తదితరులు పాల్గొన్నారు.