మన్సూరాబాద్, జూలై 13: ఎల్బీనగర్లో కాంగ్రెస్ నాయకుల ప్లెక్లీల పంచాయితీ కాస్త ముదిరి చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వచ్చాయి. దాడులు, గొడవలకు కారణం ప్రోటో కాల్ పంచాయితా లేక కార్పొరేటర్ సీటు పంచాయితా? అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి సోదరుడు జక్కిడి సత్యతేజరెడ్డి, యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనుమడు పోచబోయిన సురేష్‌యాదవ్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీటును ఆశిస్తున్నారు.
ఆరు నెలల క్రితం పోచబోయిన సురేష్‌యాదవ్ వేసిన ప్లెక్సీలో ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఫొటో వేయలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపి వేశారు. నాటి నుంచి ఇరువర్గాల మధ్య కొంత దూరం పెరిగింది. కాగా గత వారం యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు సభ్యురాలిగా పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్ను నియమించారు. దీంతో ఆమెపై యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సోమవారం ఓయూ జేఏసీ నేతలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య, మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, లలితా యాదవ్, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు చింతలకుంటలోని ఆమె నివాసానికి తరలివచ్చి ఈశ్వరమ్మకు సంఘీభావం తెలిపారు.
జానయ్య నేతృత్వంలో చింతలకుంట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించి, శివచరణ్‌రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నివాసముండే మన్సూరాబాద్, సెంట్రల్బ్యాంకు కాలనీకి వెళ్లి ఆందోళన చేపట్టడంతోపాటు ఇంటిపైకి రాళ్లు విసిరారు. ప్రతిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరులు ఈశ్వరమ్మ మద్దతుదారులపై రాళ్లు రువ్వారు. ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ ఆధిపత్య పోరు చివరకు ఎటు దారి తీస్తుందోనని సామాన్య కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఈశ్వరమ్మ యాదవ్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాయిస్ తనది కాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి తెలిపారు. మా ఇంటి మీదకు దాడి చేసేందుకు రావడం హేయమైన చర్య అన్నారు. పదవి రాగానే సొంతపార్టీ వారిపైనే దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.
– శివచరణ్ రెడ్డి
వయస్సులో ఎంతో పెద్ద మనిషి, మహిళ అని చూడకుండా పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ను కించపరిచే విధంగా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
– వట్టె జానయ్య