నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు తన పనితీరుతో చరిత్రలో నిలిచిపోయేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు. తాను తెలంగాణ హైకోర్టును విడిచి కోల్‌కతా వెళ్తున్నప్పటికీ ఇక్కడి ఉద్యోగులను ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సంలో భాగంగా గురువారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టీస్ సుజయ్‌పాల్ హాజరై మొక్కను నాటారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుజయ్‌పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి నేతృత్వలో ఇటీవల జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేశారన్నారు. కోర్టుల్లో సైతం కక్షిదారులకు మంచి వాతావరణం కల్పించడంతో పాటు జడ్జిలు, న్యాయవాదుల సహకారంతోనే త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నారు.
ప్రతిఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలని.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సుజయ్‌పాల్ అన్నారు. మెంబర్ సెక్రటరీ పంచాక్షరి, జిల్లా జడ్జిలు సురేష్, సాయిభూపతి, రఘురామ్, మైత్రేయి, వినోద్‌కుమార్, కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికిశోర్, ప్రధాన కార్యదర్శి ఎన్వీ రమణ్‌గౌడ్, ఉపాధ్యక్షులు రవీందర్, చంద్రమోహన్, స్పోర్ట్స్ కార్యదర్శి సాయిచంద్, లైబ్రెరియన్ శ్రవంతి, మహిళా ప్రతినిధి పద్మావతి, కోశాధికారి రవీందర్ నాయక్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీలత, పవార్ తదితరులు పాల్గొన్నారు.