హైదరాబాద్, ఆట ప్రతినిధి ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రీడలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. లాల్‌బహుదూర్ స్టేడియంలో కేసీఆర్ కోహినూర్ కప్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్ద వేశారన్నారు.
క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎళ్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు. జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కే.మహేశ్వర్ సాగర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, హైదరాబాద్ జిల్లా క్రీడా యువజన సంక్షేమ శాఖ అధికారి సుధాకర్ రావు పాల్గొన్నారు.