అంబర్‌పేట, సెప్టెంబర్ 8 : వినాయక నిమజ్జనానికి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తూర్పు మండలం ఇన్చార్జి డీసీపీ సునీల్‌దత్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ శుక్రవారం సా మూహిక వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని తీసుకుంటున్న బందోబస్తు చర్యల ను గురువారం ఆయన వివరించారు. తూర్పు మండలం పరిధిలోని అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్ తదితర తొమ్మిది పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 830 వినాయకులు శుక్రవారం నిమజ్జనానికి తరలివెళ్తున్నాయని చెప్పారు. రాచకొండ పరిధిలో మరో 300 వరకు వినాయకులు నిమజ్జనానికి తరలివెళ్తాయని పేర్కొన్నారు.
నిమజ్జనం సాఫీగా జరిగేందుకు 2,300 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డీఎస్సీలు, సీఐలు, ఎస్సైలు, మహిళా ఎస్సైలు, ఏఎస్సైలు/హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో బందోబస్తు చేపట్టామన్నారు. వీరే కాకుండా ఎస్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్, హోం గార్డు ప్లాటూన్లు, టీఎస్ఎస్పీ, రిక్రూట్మెంట్ కానిస్టేబుళ్లు అదనంగా బందోబస్తుకు వచ్చారని పేర్కొన్నారు. ఒక్కో ప్లాటూన్‌కు 20 నుంచి 22 మంది సిబ్బంది ఉంటారని, అత్యంత సమస్యాత్మక రూట్లలో పికెటింగ్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. నిమజ్జనం మొత్తం సీసీటీవీ కెమెరాల నిఘాలో సాగనుందని తెలిపారు.
సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాత నేరస్తులు, రౌడీషీటర్లు, కమ్యూనల్స్ షీట్స్‌ను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మండపాల నుంచి గణేశులను ఎత్తి వాహనాల్లో ఉంచేందుకు 20 క్రేన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని అన్నారు. ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. గణేశులను తొందరగా నిమజ్జనానికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.