సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): నగర సౌందర్యానికి ప్రత్యేక ఆయువు పట్టు హుస్సేన్ సాగరం. అలాంటి హుస్సేన్‌సాగర్‌లో లేజర్‌షోతో పాటు, అన్ని వైపులా సందర్శకుల గ్యాలరీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు సూచించారు. అక్కడ కార్నివాల్ కంటే ఎక్కువ సందడి కనిపిస్తున్నదన్నారు. పిల్లలకు సంబంధించి మరిన్ని కార్యలాపాలను ప్రారంభించాలని సూచించారు. కళలు, హస్తకళలు, సంగీతం లాంటివి ఒక మ్యూజికల్ అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై సండే సందడికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై వాహనాలు రాకుండా, సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
హుస్సేన్ సాగర తీరం.. సంధ్యా సమయం… అక్కడ గడిపే ఆ సమయం ఎన్నో మధుర అనుభూతులకు నెలవు. ప్రతి ఆదివారం సాయంత్రం పండగ వాతావరణం ఉట్టిపడేలా చిన్నారులు మొదలుకొని, యువత, మహిళలు, వృద్ధులు ఇలా అందరూ ఒకేచోట ఎంజాయ్ చేసేలా కార్నివాల్ తరహాలో సందడి ట్యాంక్‌బండ్‌పై ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. నగరవాసులే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఎంతగానో ఎంజాయ్ చేసే ట్యాంక్‌బండ్‌కు మరిన్ని ఆకర్షణలు మున్ముందు రానున్నాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో ట్యాంక్ బండ్ వద్ద పిల్లలు మరింత సరదాగా గడిపేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత రెండు ఆదివారాలు సాయంత్రం 5 గంటల నుంచి ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో నగరవాసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడుపుతున్న పరిస్థితులను చూసిన మంత్రి కేటీఆర్ పిల్లల కోసం ట్యాంక్‌బండ్‌పై ఆర్ట్స్, క్రాప్ట్స్, మ్యూజిక్ వంటి కార్యకలాపాలు నిర్వహించాలని, లేజర్‌షో, సందర్శకుల గ్యాలరీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
హుస్సేన్‌సాగర్ తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల వారధిగా ఉన్న ట్యాంక్‌బండ్ సుందరీకరణ కోసమే సుమారు రూ.27 కోట్లు వెచ్చించారు. హుస్సేన్‌సాగర్‌కు ఇరువైపులా వాకర్స్, పాదచారులు, పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రానైట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు, లైటింగ్ వ్యవస్థను అమర్చారు. ఇందులో భాగంగానే ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని మరిన్ని కొత్తందాలు, పచ్చదనంతో మరింత అందంగా తీర్చిదిద్దుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు మరో 4 వారాల్లో పూర్తయి, ఈ ప్రాంతమంతా సందర్శకులు, పర్యాటకులు హాయిగా గడిపేందుకు అనుకూలంగా మారుతుందని చెబుతూ ల్యాండ్ స్కేపింగ్ చేసిన ఫొటోలను ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హెచ్ఎండీఏ అధికారులు వచ్చే ఆదివారం నాటికి ఆ ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను సుమారు రూ.27 కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టింది. మరో నాలుగు వారాల్లో సుందరీకరణ పనులు పూర్తవుతుండగా, మంత్రి సూచనలతో మరిన్ని అదనపు ఆకర్షణలు ఇక్కడ ఉండేలా చేయనున్నారు. దీంతో ఇంతకు ముందెన్నడూ లేని వాతావరణం ఇప్పుడు ట్యాంక్‌బండ్‌పై నెలకొననున్నది. ఇప్పటికే సందర్శకులు వేలాదిగా తరలివచ్చి సాయంత్రం వేళల్లో సరదాగా గడుపుతున్నారు. వీల్ చైర్లో చంటిపాపల నుంచి మొదలు కొని బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ట్స్, క్రాప్ట్స్, మ్యూజిక్ కార్యకలాపాలు పిల్లలకు మరింత సరదాను తెచ్చి పెడతాయని నగరవాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై సందర్శకుల కోసం చేస్తున్న ఏర్పాట్లు ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని పలువురు నగరవాసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో ట్యాంక్‌బండ్‌పై గడిపిన మధుర క్షణాలను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఫొటోలు, వీడియోలతో షేర్ చేసుకుంటున్నారు.
విశ్వ నగరానికి సరికొత్త సొబగులు అద్దుతూ.. లుంబినీ పార్కులోని లేజర్ షో తరహాలోనే ఇక నుంచి హుస్సేన్ సాగర్ జలాల్లోనూ నిర్వహించాలని, ఆ లేజర్ షోను వీక్షించేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారులు దానిపై దృష్టి సారించారు. ప్రపంచంలోని వివిధ మెట్రో నగరాల్లో సందర్శకులు, దేశ, విదేశీ పర్యాటకుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి, వాటిని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయనున్నారు. లాస్ వెగాస్‌లోని బెల్లాజియంలో జరిగిన లేజర్ షో తరహాలోనే ట్యాంక్‌బండ్‌పై అలాంటి లేజర్‌షోను సాగర్ జలాల్లో నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించి, అలాంటి ఏర్పాట్లు చేయనున్నారు. లేజర్ షోకు తోడుగా పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు వీలుగా గేమింగ్ జోన్‌ను సైతం ట్యాంక్‌బండ్ పొడవునా ఏర్పాటు చేయనున్నారు.