సికింద్రాబాద్ : నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో మెరుగైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. త్వరలోనే సివరేజి సమస్యల పరిష్కారానికి సుమారు రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు సోమవారం సీతాఫల్మండి డివిజన్లోని మధురానగర్‌లో దాదాపు రూ.2.46కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. దీంతో పాటు రూ.27లక్షలతో చేపట్టనున్న సివరేజి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లలో ఉన్న ప్రతి బస్తీలో మౌళిక సదుపాయల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలను సమస్యల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 50 ఏండ్ల కాలంలో చేపట్టని పనులను కుడా ప్రారంభించి పూర్తిచేశామన్నారు.
పేద, మధ్యతరగతి, సామాన్యులకు అందుబాటులో నిలిచేలా సకల హంగులతో ఫంక్షన్ హాల్స్‌ను సికింద్రాబాద్‌లో తీర్చిదిద్దుతున్నా మని, ఈ క్రమంలోనే సీతాఫల్‌మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ తరహాలో అడ్డగుట్టలో రూ. 2.25 కోట్లు, లాలాపేటలో రూ. 6.9 కోట్లతో నూతనంగా ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మధురానగర్ కాలనీతో పాటు షాబాజ్ గుడా, శ్రీనివాస్ నగర్, అశోక నగర్ ప్రాంతాల్లో సివరేజ్ సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షలతో కొత్త సివేరేజ్ లైన్ నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఆదే విధంగా సికింద్రాబాద్ పరిధిలో సివరేజ్ సమస్యల పరిష్కారానికి నికి రూ. 5.50 కోట్లతో 70 పనులను చేపట్టనున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. ఎస్ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ సంజీవ్ రెడ్డి ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్ ను ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ ప్రారంభించారు.
కార్యక్రమంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ దశరథ్, జలమండలి జీఎం రమణా రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు ఆశాలత, వై కృష్ణ, మధురిమతో పాటు టీఆర్ఎస్ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, మధురానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.పవన్ కుమార్ గౌడ్‌తో సహా ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.