Hyderabad | సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ బన్సీలాల్‌పేట్: భూమి, ఇండ్లు, ప్లాట్లు, వ్యాపార లావాదేవీల్లో వివాదాలు ఏదైనా సరే.. ఆయన తన అనుచరగణంతో ఈజీగా సెటిల్ చేసేస్తారు. వినలేదంటే..పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి అక్రమ కేసులు బనాయిస్తారు. అప్పటికీ వినలేదంటే నాలుగైదు కేసులు నమోదు చేయించి.. సదరు వ్యక్తిపై రౌడీషీట్ నమోదు చేస్తారు. ఇలా ఆయన సెటిల్మెంట్ల తీరు వేరుగా ఉంటుంది. తన మాటను ఎవరైనా ఎదిరిస్తే రౌడీషీట్లు నమోదు చేయడమే కాకుండా, కుటుంబ సభ్యులను ఠాణాల్లోకి బలవంతంగా తీసుకొస్తారు. హైదరాబాద్ నడిబొడ్డున ఈస్ట్‌జోన్‌లో ఏ ఏసీపీ వ్యవహారమిది. ఇంత జరుగుతున్నా.. సదరు అధికారిపై ఫిర్యాదులు వస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బాధితులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
పోలీస్స్టేషన్ల పునర్విభజన తరువాత నార్త్‌జోన్‌లో ఉన్న పోలీస్స్టేషన్లు ఈస్ట్జోన్లోకి వెళ్లాయి. అక్కడ కొత్త డివిజన్ ఏర్పడింది. ఆ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి.. తన వద్దకు వచ్చే పంచాయితీలను ఈజీగా సెటిల్ చేస్తారు. తనకు కావాల్సిన పని కోసం ఎంతకైనా తెగిస్తారు. తన డివిజన్లోని ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో సమస్య ఉందంటే ఆ ఠాణా ఇన్స్పెక్టర్, డీఐ, ఎస్సైలకు ఆదేశాలు జారీ చేస్తారు. ఒక వేళ అది సివిల్ కేసంటూ ఆ ఇన్స్పెక్టర్ ఏమైనా అడ్డు చెప్పాడంటే… ‘నీవు కాకపోతే పక్క పోలీస్‌ష్టేషన్ వాడిని అక్కడికి పంపిస్తా… నా డివిజన్లో ఉన్న మూడు ఠాణాలకు నేనే కింగ్నం’టూ బెదిరించి మరి తన కిందిస్థాయి అధికారులతో పనులు చేయిస్తారు. కొందరు బెదిరింపులకు, మరికొందరు వాటాలకు ఆయన చెప్పినట్లు తాన అంటే తందాన అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
చిలకలగూడ పోలీసులు తనను వేధిస్తున్నారని, అక్రమంగా బెదిరించి తనతో చెక్కులపై సంతకాలను చేయించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ధర్మేందర్‌రెడ్డి అనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. వాటి వివరాలను ఆదివారం మీడియా సమక్షంలో వెల్లడించాడు. పద్మారావునగర్‌లో వైన్స్ దుకాణం నిర్వహిస్తున్న పాతూరి ధర్మేందర్‌రెడ్డి మరో నలుగురితో కలిసి గాంధీనగర్, రామ్‌నగర్‌లో 2021-23 రెండేండ్ల పాటు రెండు వైన్స్ షాపులలో పెట్టుబడి పార్ట్నర్గా ఉన్నాడు. ఏడాది కిందటే ఆ షాపుల గడువు, వారి మధ్య రాసుకున్న ఒప్పందం కూడా పూర్తయింది. కాగా, సెప్టెంబర్ 25న పోలీసులు పిలువడంతో చిలకలగూడ పీఎస్‌కు వెళ్లానని ధర్మేందర్‌రెడ్డి తెలిపాడు. ఆ సమయంలో చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేశ్ గౌడ్, అక్కడ తన నలుగురు పాత పార్ట్నర్లు, మరో వ్యక్తి ఉన్నారని చెప్పాడు.
తాను వారికి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నదని, వాటిని రెండు నెలల్లోగా చెల్లించాలని తనపై ఒత్తిడి చేసినట్లు తెలిపాడు. రెండు వైన్స్ షాపుల గడువు, తమ మధ్య అగ్రిమెంట్, ఆర్థిక లావాదేవిలు కూడా అయిపోయాయని, తాను ఎవరికీ డబ్బులు బాకీ లేనని, ఏడాది తరువాత ఇప్పుడు తానేందుకు డబ్బులు ఇవ్వాలని అడగడంతో తనపై ఏసీపీ చేయి చేసుకున్నారని, బండబూతులు తిట్టారని ధర్మేంధర్‌రెడ్డి వాపోయాడు. ఒక్కొక్కరికీ రు.32 లక్షల చొప్పున ఐదుగురికి (రూ.1 కోటి 60 లక్షలు) రెండు నెలల వ్యవధిలోగా తాను డబ్బులు చెల్లించాల్సిందేనని పోస్ట్ డేటెడ్ చెక్కులపై బలవంతంగా సంతకాలను చేయించుకున్నారని ఆరోపించారు.
సంతకాలు చేయకపోతే వైద్యురాలైన తన భార్యను, ఇతర కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్ కు తీసుకుని వచ్చి వారిపై కూడా కేసులను పెడతామని ఏసీపీ బెదిరించడంతో భయపడి సంతకాలు చేశానని ధర్మేందర్‌రెడ్డి వాపోయాడు. తన ఫోన్ లాక్కుని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదని, సాయంత్రం 4 గంటలకు తాము పీఎస్‌కి వెళ్లగా, తెల్లవారుజామున మూడు గంటల వరకు నిలబడే ఉన్నానని చెప్పాడు. అదే అర్ధరాత్రి సమయంలో తాను కొనుగోలు చేసినట్టు బాండ్ పేపర్లు కూడా పోలీసులే తీసుకొచ్చినట్లు చెప్పాడు. తనతో బలవంతంగా సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్లో ఈ సెటిల్మెంట్ చిలకలగూడ పీఎస్‌లో జరిగినట్టు వాళ్లే రాశారని, దానిని గుర్తించిన తన లాయర్ సలహా మేరకు తాను సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశానని తెలిపాడు.
చెక్కులను రాయించుకున్న ఐదుగురితో పాటు డీజీపీ, నగర్ పోలీస్ కమిషనర్, ఈస్ట్ జోన్ డీసీపీలను ప్రతివాదులుగా చేర్చానని చెప్పాడు. అప్పటి నుంచి తన వైన్ షాపు వద్ద చిలకలగూడ పోలీసులు పెట్రోలింగ్ వ్యాను పెట్టుకుని, కస్టమర్లు ఎలాంటి చిన్న గొడవ పడినా.. తనపై కేసు బుక్ చేయడానికి పన్నాగం పన్నారని పేర్కొన్నాడు. మఫ్టీలో వచ్చిన కానిస్టేబుళ్లు లోపలికి వచ్చి గొడవలు పెట్టుకుని, యజమానినైన తనపై, తన షాపులో పనిచేసే సిబ్బందిపై అక్రమంగా కేసులను నమోదు చేస్తున్నారని, పీఎస్‌కు పిలిచి టార్చర్‌కు గురి చేస్తున్నారని తెలిపాడు. మానసికంగా తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, తనకు న్యాయం చేయాలని, తనతో బలవంతంగా రాయించుకున్న చెక్కులను, ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ రెండు రోజుల కిందట తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని ధర్మేందర్ తెలిపాడు.