సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చిత్ర విచిత్రాలు చోటుచేటుకుంటున్నాయి. ఖజానా నింపుకోవాలనే క్రమంలో అధికారుల తొందరపాటుతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు దశల్లో జరగాల్సిన ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే క్రమంలో ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా దరఖాస్తుల తీరు మారుతుంది. ప్రభుత్వం కూడా క్రమబద్ధీకరణ చేసి జనాలకు లబ్ధి చేయాలనే భావన కంటే.. ఖజానా నింపుకోవాలనే ఉద్దేశమే ఈ తప్పులకు కారణమవుతుందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గడువు ముంచుకొస్తున్న దరఖాస్తుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. హెచ్ఎండీఏ పరిధిలో 3.5లక్షల మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకోగా లక్షకు పైగా దరఖాస్తులు ఇప్పటికి ఎల్1(ప్రాథమిక) దశలోనే ఉన్నాయి. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఈ దరఖాస్తుల్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో అధికారులు వీటిపై దృష్టి పెట్టలేదు. కేవలం భవన నిర్మాణ అనుమతులు అవసరమైన వారు మాత్రమే.. అధికారులను ఆశ్రయించి, దరఖాస్తుల్లో దొర్లిన తప్పొప్పులను సరిచేసుకుని నిర్మాణాలను చేపట్టారు.
ఈ క్రమంలో అవసరమైన పెనాల్టీలు కట్టిన వారు కూడా జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాట్లను క్రమబద్ధీకరించి సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వడంతో.. దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే అధికారులు అప్డేట్ చేస్తున్నారు. దీంతో సంబంధిత దరఖాస్తుల పురోగతి(స్టేటస్) గందరగోళంగా మారింది.
మూడు దశల వడపోతల తర్వాత ఫీజు చెల్లించాలని సమాచారం చేరవేయాల్సి ఉంది. కానీ అధికారుల తప్పిదం వలన సమీపంలో లేని ప్రభుత్వ భూములు, చెరువు భూములు కూడా వెంచర్లలోకి చొచ్చుకువస్తున్నాయి. పరిశీలించకుండానే ఫీజులు చెల్లించాలనే సమాచారాన్ని చూసి దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో తక్కువ ధరకు వస్తుందని జీపీ లే అవుట్లలో కొనుగోలు చేస్తే,లేఅవుట్లో కనిపించిన అభ్యంతరాలు..ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ సమీపంలోని ఓ కాలనీ పరిధిలో ఓ వ్యక్తి 250 గజాల ఖాళీ జాగాను 8 ఏళ్ల కిందట కొనుగోలు చేశారు. అయితే ఆ వెంచర్ జీపీ లే అవుట్లలో ఉందని చెప్పడంతో ఎల్ఆర్ఎస్ కట్టుకునే వెసులుబాటు కల్పించడంతో 2020లో ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ దరఖాస్తుల్లో ఎలాంటి పురోగతి లేదు. కానీ తాజాగా ఫైల్ పురోగతిని ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో చూడగా… అప్లికేషన్ ఇంకా ఎల్1 దశలోనే ఉందని, నిషేధిత, శిఖం భూముల్లో వెంచర్ నిర్మాణం కారణంగా ఫీజు ఇంటిమేషన్ చేయలేదని అధికారులను ఆశ్రయిస్తే తెలిసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం తన లే అవుట్‌కు దాదాపు అర కిలోమీటర్ దూరంలో కూడా చెరువు, కుంట లేదని తెలుసుకున్నాడు. స్థానికంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా మరోసారి నిజనిర్ధారణ చేసుకునే క్రమంలో.. అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి జలవనరులు కూడా లేవని తేలింది.
– అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చిద్రుప్ప గ్రామ పరిధిలో ఓ జీపీ అనుమతులతో భారీ వెంచర్ డెవలప్ చేసి, రూ.10వేలు చెల్లించి వెంచర్ మొత్తాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అప్లికేషన్‌పై ఎలాంటి లావాదేవీలు లేవని వెబ్సైట్లో చూపుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఫీజు ఇంటిమేషన్ డౌన్లోడ్ చేయగా.. రూ.-19,236 లు చెల్లించాలని ఉండటం చూసి దరఖాస్తుదారుడు నివ్వెరపోయాడు. మైనస్‌లో ఎలా చెల్లించాలని తెలియక అధికారుల చుట్టూ మూడు, నాలుగు సార్లు ప్రదక్షిణ చేస్తే గానీ తేల్చుకోలేకపోయారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఆప్లికేషన్‌లో ఫీజు ఇంటిమేషన్‌లో తప్పు దొర్లినట్లుగా చెప్పి చేతులు దులుపుకున్నారు.
దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేలా మార్చి 31లోపు ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందే వీలు ఉందని ఆశపెట్టింది. కానీ దరఖాస్తుల పరిశీలన అస్తవ్యస్తంగా ఉండటం, గతంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి అయినవారికి అస్పష్టమైన ఫీజుల వివరాలతో పుణ్య కాలం కాస్తా ముంచుకొస్తుంది. ఇప్పటికే దరఖాస్తులు ఏ దశలో ఉన్న సంబంధం లేకుండా ఫీజులు చెల్లించాలని సమాచారాన్ని దరఖాస్తుదారులకు కోరడంలోనూ గందరగోళమే నెలకొని ఉంది. ఒకే వెంచర్లో కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు ఫీజులు ఉండటం కూడా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ లోప భూయిష్టంగా ఉందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు.
మేడ్చల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరో ఆరు రోజులే గడువు మిగిలింది. ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించడంలో అంతగా ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు 10 శాతానికి మించి దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించలేదు. ఎఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం అందించే రాయితీని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేసిన దరఖాస్తుదారులు అంతగా స్పందించడం లేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం 1,55,373 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 85,506 దరఖాస్తులను ఆమోదించగా 1,448 దరఖాస్తులను తిరస్కరించారు. ఇందులో 7 వేల పైచిలుకు దరఖాస్తుదారులు మాత్రమే క్రమబద్ధీకరణకు ఫీజులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మరో 76 వేల దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది.
దరఖాస్తుల పరిశీలనలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నెమ్మదించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాలని కోరుతున్న అంతగా ఆసక్తి కనబర్చడం లేదని చెబుతున్నారు. దరఖాస్తుదారులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ కోరుతున్నారు.