ఎల్బీనగర్, అక్టోబర్ 30: నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే నివాసంలో జీహెచ్ఎంసీ అధికారులతో బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పరిష్కారం కోసం ప్రకటనతో పాటు మంత్రి కేటీఆర్ జీవో కాపీని విడుదల చేస్తారని తెలిపారు.
ఈ ప్రకటన వేలాదిమంది నియోజకవర్గంలోని కుటుంబాలకు మేలు చేకూర్చనున్న నేపథ్యంలో అందరినీ ఒకే చోట చేర్చి సభ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, డిప్యూటీ కమిషనర్లు సురేందర్‌రెడ్డి, హరి కృష్ణయ్య, మారుతీ దివాకర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.