ఇబ్రహీంపట్నం: రామోజీ యాజమాన్యం ఆధీనంలో ఉన్న పేదల ఇండ్ల స్థలాలను విడిపించి పేదలకు పంపిణీ చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాగన్‌పల్లి గ్రామంలో 2007లో అప్పటి ప్రభుత్వం ఇంటిస్థలాల సర్టిఫికెట్లు ఇచ్చిన పేదలందరూ కలిసి తమ స్థలాల్లోకి వెళితే పోలీసులు అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ 60గజాల చొప్పున ఇంటిస్థలం పట్టాలు ఇచ్చిన నక్ష ప్రకారం పొజిషన్ కూడా చూపించారన్నారు.
ఈ ఇండ్ల స్థలాలను రామోజీ యాజమాన్యం ఆక్రమించి లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి రాకుండా ఇబ్బందులు పెడుతున్నదన్నారు. ఇంటి స్థలాలకు వెళ్లే దారిలో కందకాలు తీశారన్నారు. ప్రభుత్వ నక్ష రోడ్డును కూడా రామోజీ యాజమాన్యం ప్రజలను రానివ్వకుండా అడ్డుగోడ నిర్మించుకుందన్నారు. లబ్ధిదారులు తమ ఇండ్ల స్థలాల్లోకి వెళ్తున్న క్రమంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారని, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్‌కు గాయాలయ్యాయని తెలిపారు.
రామోజీ ఆధీనంలో ఉన్న మరో 370 ఎకరాలను పదివేల మందిని సమీకరించి ఆక్రమిస్తామని హెచ్చరించారు. 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న పేదలపై కేసులు నమోదు చేయడమే తప్ప.. సమస్యను పరిష్కరించటం లేదని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మా రైతులకు తిరిగి భూములను ఇస్తామని చెప్పి మోసం చేసిందని, మళ్లీ ఫ్యూచర్ సిటీ పేరుతో 2500ఎకరాల భూములను పేదల నుంచి సేకరించేందుకు పూనుకుందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర ముగింపు సందర్భంగా పోలీసులు అనుమతి ఇచ్చి చివరకు నిరాకరించాన్నారు. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించిన పేదల ఇంటిస్థలాలు తిరిగి అప్పగించే వరకు ఉద్యమిస్తామమన్నారు.