అధికారుల అలుసో.. నిర్లక్ష్యమో..ఇంకేమైనా కారణమో.. భూ కబ్జాదారులు మాత్రం బరితెగిస్తున్నారు. ఎంతలా అంటే.. సమాధులను సైతం వదిలిపెట్టడం లేదు.. వాటిని కూల్చి ఏకంగా ఇండ్లు నిర్మించేస్తున్నారు. విలువైన సర్కారు భూములను కొల్లగొడుతున్నా.. తిలాపాపం తలాపిడికెడు.. అన్న చందంగా..అధికార యంత్రాంగం మిన్నకుండిపోతున్నది. మణికొండ గ్రామ సర్వే నంబర్ 260,199ల్లో 289 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చింది. అయితే ఇక్కడ అర్హులకంటే.. నకిలీ పట్టాలతో ‘లెక్క’కు మించి అనర్హులే అడ్డగోలుగా గృహాలను నిర్మించుకున్నారు. ఇది చాలదన్నట్లు కొందరు శ్మశానవాటిక భూములనూ వదిలిపెట్టలేదు..అయినా.. గండిపేట రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు ఉండిపోతున్నారు. ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదు.
-మణికొండ, జనవరి 5
మణికొండ సర్కిల్ పరిధిలోని మణికొండ గ్రామ సర్వేనెంబరు 260,199లలో అర్హులైన 289 మంది పేద ప్రజలను గుర్తించి అప్పటి సర్కారు ఇళ్ల పట్టాలను ఇచ్చింది. ఇచ్చిన పట్టాల కన్నా .. రెట్టింపుగా నకిలీపట్టాలతో ఈ కాలనీలో ఇళ్ల నిర్మాణాలు అడ్డగోలుగా నిర్మించుకున్నారు. నిర్మించిన వాటిలో అధికంగా అన్ని నిబంధనలను అతిక్రమించి నిర్మించినవే. వీటిపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడరు. ఇచ్చిన పట్టాలకు మించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇండ్లపై ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.
ఇవన్నీ చాలవన్నట్లు కొందరు అక్రమార్కులు సర్వే నంబర్ 199లో ఉన్న శ్మశానవాటికలోని సమాధులను సైతం రాత్రికి రాత్రే కూల్చి ఇండ్లు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు శివపురికాలనీలో అర్హులకు కేటాయించిన పట్టాల కన్నా అధికంగా నకిలీ పట్టాలను సృష్టించడంలో కొంతమంది అక్రమార్కుల ముఠా ప్రభుత్వ స్థలాలను సదరు రెవెన్యూ శాఖలోని కొంతమంది అధికారులతో లోపాయికారి ఒప్పందాలను చేసుకుని సర్కారు భూమిని ఆక్రమించి ఇండ్లను నిర్మించి కోటి రూపాయలకు ఓ ఇళ్లును విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ అక్రమాలపై అనేక పర్యాయాలు స్థానిక ప్రజలు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా.. తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారే తప్ప … ఏనాడూ సర్వేలు చేసి విలువైన సర్కారు భూములను గుర్తించిన దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు. కొంతమంది అక్రమార్కుల ముఠా సర్కారు అధికారులతో జతకట్టి కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులూ వీరితో చేతులు కలుపుతున్నారా? లేక నిర్లక్ష్య వైఖరితో వదిలేస్తున్నారా? అంటూ వివిధ కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేవిషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు.
కేటాయించినవి..289 పట్టాలే
మణికొండ గ్రామ సర్వే నంబర్ 260లో అర్హులైన పేద ప్రజలు 289 మందికి ఇండ్ల పట్టాలను 60 గజాల చొప్పున కేటాయించారు. వీటికి అప్పట్లోనే స్థలాలను సైతం అధికారులు దగ్గరుండి చూపించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నాయి. 289 పట్టాలకు బదులుగా సుమారు 500 ఇండ్లకు పైగా నిర్మితమై ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నకిలీపట్టాలతోనే నిర్మించేశారు. ఇవి కాకుండా పక్కనే ఉన్న సర్వే నంబర్ 199లోని శ్మశానవాటికలోని భూములను సైతం కొంతమంది నాయకులతో సహకారంతో కబ్జాలు చేసి ఇళ్లను నిర్మించేశారు. ఇదీకాక మిగిలిన సమాధులను సైతం కూల్చివేసి రిగోడలను నిర్మిస్తుండటంపై విస్మయం కలిగిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉండగా, పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నా ప్లాటు కబ్జా చేస్తున్నారు..
పేద కుటుంబానికి చెందిన అర్హురాలైన తనకు గతంలో ప్రభుత్వం అరవై గజాల ఇందిరమ్మ ఇంటి పట్టాను మంజూరు చేసిందని, దానిని కబ్జా చేసేందుకు మణికొండ గ్రామానికి చెందిన ఉమారాణి అనే మహిళ గండిపేట తహసీల్దారు శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. డప్పు అర్జున్ అనే వ్యక్తి తనకు కేటాయించిన 60 గజాల పట్టా భూమిలో జేసీబీ పెట్టి పనులు చేయడం మొదలు పెట్టారని, గతంలో కూడా ఈ వ్యక్తితో పాటు డప్పు నర్సింహ్మ, కొడిచెర్ల చిరంజీవి, సాయిరెడ్డి, నందు మరికొంతమంది కలిసి తనను బెదిరించి భయాందోళనలకు గురిచేసి స్థలాన్ని ఖాళీ చేయమని తనను బెదిరిస్తున్నారంటూ ఉమారాణి తహసీల్దార్‌కు విన్నవించారు. గతంలోనూ వీరంతా దొంగ డాక్యుమెంట్లను తయారు చేసి పలు స్థలాలను కబ్జా చేశారని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమారాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
మణికొండ గ్రామ సర్వే నంబరు 260, 199లో గతంలో కేటాయించిన ఇండ్ల పట్టాల కబ్జాలపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై ఎప్పుకప్పుడు విచారణలు చేపట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొందరిపై కేసులు సైతం నమోదు చేశాం. సర్కారు భూములను కబ్జాలు చేసి తక్కువ ధరకే వస్తుందని చాలామంది ఆకర్షితులై కొనుగోలు చేస్తే ఎప్పటికైనా వాటిని కూల్చివేస్తాం. అమాయక ప్రజలు వాటిని కొనుగోలు చేయవద్దు.
– శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, గండిపేట