దుండిగల్, ఏప్రిల్ 12: భూవివాదంలో తలెత్తిన ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్లింది. మాటామాట పెరుగడంతో పోలీసుల ముందే ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దుండిగల్ సర్కిల్ పరిధి, బౌరంపేట్లోని ఓ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కేటాయించిన భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం సాగుతోంది. బౌరంపేట్ గ్రామరెవెన్యూ పరిధిలోని ఓ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు చెందిన భూమిని కొనుగోలు చేసిన బౌరంపేట్‌కు చెందిన సర్గారి జీవన్‌రెడ్డి అనే వ్యక్తి కొన్ని రోజులుగా అక్కడ భూమి చదును చేయిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బౌరంపేట్తోపాటు మల్లంపేట్‌కు చెందిన కొందరు బీజేపీ నేతలు జీవన్‌రెడ్డి చదును చేస్తున్న భూమి ముందు ఉన్న శంభీపూర్-బౌరంపేట్ రహదారిపై మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఇది గమనించిన జీవన్‌రెడ్డి 100కు డయల్‌చేసి తన భూమివద్ద ఉన్న రోడ్డుపై కొందరు వ్యక్తులు సమావేశమై న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీంతో దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, అదే సమయంలో అక్కడికి చేరుకున్న జీవన్‌రెడ్డి చట్టబద్దంగా కొనుగోలు చేసిన తన భూమిపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని నిలదీసే క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు పోలీసుల ముందే బాహాబాహీకి దిగారు. పోలీసులు, అక్కడున్న మరికొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆగలేదు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేయడంతో దుండిగల్ పోలీసులు జీవన్‌రెడ్డితోపాటు బౌరంపేట్కే చెందిన ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.