Old City Metro | సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు భూముల పంచాయితీ సంక్లిష్టంగా మారుతున్నది. 7.5 కిలోమీటర్ల పొడువైన ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులు సేకరించాల్సి ఉన్నా… ఇప్పటివరకు 205 ఆస్తులు మాత్రమే మెట్రోకు అందజేయగా… మిగిలిన ఆస్తుల సేకరణలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
ఓ వైపు చారిత్రక, మతపరమైన కట్టడాల విషయంలో కోర్టు చిక్కులు రాగా, మరోవైపు ప్రైవేటు వ్యక్తులు కూడా ఇదే తరహాలో పరిహారం కోసం ప్రతిఘటించడంతో భూసేకరణ అనుకున్నంత సులభంగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. 7.5కిలోమీటర్ల పొడవైన మార్గంలో మతపరమైన, చారిత్రక కట్టడాలే ఎక్కువగా ఉన్నాయి.
వీటి విషయంలో మెట్రో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని, ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పనులు చేపడుతామన్నంటున్న క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును విశ్వసించడం లేదు. అదేవిధంగా గజానికి రూ. 80వేలకు పైగా పరిహారం చెల్లిస్తామని చెబుతున్నా… మార్కెట్ విలువ ఆధారంగా మరింత అధిక పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూనే… ప్రభావిత ఆస్తుల యాజమానులతో చర్చలు జరుపుతున్నా… ఆస్తుల సేకరణ గడిచిన 4 నెలలుగా సాగుతూనే ఉంది.