చార్మినార్, జూలై 10 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా సింహావాహిని ఆలయం ముస్తాబైనట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ సింహావాహిని మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం నిర్వహించే 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందన్నారు. రేపటి నుంచి నుండి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలిరోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం తదుపరి ఉ. 8:30 గంటలకు దేవి అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శిఖర పూజ : బోనాల ఉత్సవాలా ప్రారంభ వేడుకలను పురస్కరించుకుని ముందుగా శిఖర పూజతో వేడుకలు ఆరంభిస్తామని చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు. ఉ. 10:30 నిమిషాలకు శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ కలిసి పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అమ్మవారికి శిఖరపూజ, ధ్వజారోహణ గావించిన అనంతరం ఉత్సవాలను లాంఛనంగా కొనసాగుతాయాన్నరు. సాయంత్రం 6:00 గంటలకు ఆలయ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులతో కలిసి కలశ స్థాపన చేస్తారని ఆలయ ప్రతినిధులు తెలిపారు.