ఒకప్పుడు లేక్‌సిటీగా పేరొందిన హైదరాబాద్.. కబ్జాలతో ఆ ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతున్నది.యథేచ్ఛగా జరుగుతున్న ఆక్రమణలతో నగరంలో చెరువులు, కుంటలు లేకుండాపోతున్నాయి. భవిష్యత్‌లో మహానగరం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్జోన్ల నిర్ధారణ పూర్తి చేసి ఉంటే.. చెరువులకు రక్షణగా ఉండేది. కానీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తటాకాలు అక్రమ నిర్మాణాలకు నిలయాలుగా మారిపోయాయి. ఇదిలా ఉంటే హెచ్ఎండీ పరిధిలో 13 చెరువుల్లో 1100 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. ఒక్క దుర్గం చెరువు చుట్టే అత్యధికంగా 204 నిర్మాణాలు బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉండటం గమనార్హం.
హెచ్ఎండీఏలో 13 చెరువుల పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. అధికారులు ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ నిర్ధారణ పూర్తి చేసి ఉంటే చెరువులకు రక్షణగా ఉండేది. కానీ హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ నిర్మాణాలకు తటాకాలు నిలయాలుగా మారాయి. దీంతో హెచ్ఎండీఏలోని 13 చెరువుల పరిధిలో 1100 ఆక్రమణలు జరిగినట్లు తేలింది.
తాజాగా, హెచ్ఎండీఏ అధికారులను హైకోర్టు ఆదేశిస్తూ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ డీమార్కేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. క్షేత్రస్థాయిలోని జిల్లా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. నివేదికలు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన వాటిల్లో హెచ్ఎండీఏ పరిధిలోని దుర్గం చెరువు చుట్టూ అత్యధికంగా 204 నిర్మాణాలు బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్లు తేల్చారు.
సమన్వయలోపం..చెరువుల పాలిట శాపంగా..
అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయలోపం హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పాలిట శాపంగా మారుతున్నది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అనధికారిక భవనాలు, నిర్మాణాలు చెరువుల పరిధిలో భారీగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణపై మరింత లోతుగా విశ్లేషించేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా దుర్గం చెరువు చుట్టూ ఉన్న కబ్జాలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో… హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దుర్గం చెరువు తరహాలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న చెరువులను తనిఖీలు చేయడంతోపాటు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రక్రియ పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
మరో రెండు నెలల్లో..
అగస్టు 1 నాటికి 51 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయగా, మిగిలిన 200 చెరువుల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ల నిర్ధారణ ఫైనల్ నోటిఫికేషన్‌కు మరో రెండు నెలల్లో పూర్తి చేయాలనే ఆదేశాలున్నాయి. ఇప్పటివరకు ఉన్న ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్ మధ్య కాల వ్యవధి ఆధారంగా పర్యవేక్షించనున్నారు.