బంజారాహిల్స్,జనవరి 25: బంగారు ఆభరణాలను మార్చుతామంటూ ఆభరణాల షాపుల సిబ్బంది దృష్టి మరల్చి నకిలీ బంగారం ఇచ్చి అసలైన బంగారంతో ఉడాయిస్తున్న తమిళనాడుకు చెందిన కిలాడీ గ్యాంగ్‌లోని ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని ఎస్కేటీ జువెలర్స్‌కు ఈనెల 14న ఇద్దరు మహిళలు వచ్చారు. తమవద్ద 10 తులాల బంగారు గొలుసులు ఉన్నాయని, వాటిని తీసుకుని కొత్త ఆభరణాలు ఇవ్వాలని, కొంత డబ్బు అవసరం ఉందంటూ నమ్మబలికారు.
దీంతో షాపులో పనిచేస్తున్న మేనేజర్ శివకుమార్ ఆభరణాలలోని ప్యూరిటీని పరీక్షించేందుకు సమీపంలోని నాణ్యతా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఒరిజినల్ ఆభరణాల స్థానంలో అదే డిజైన్‌లో ఉన్న నకిలీ ఆభరణాలను పెట్టారు. షాపుకు వచ్చిన తర్వాత తమకు నచ్చిన 7తులాల కొత్త ఆభరణాలు ఇచ్చిన షాపు నిర్వాహకులు రూ.35వేలు నగదు కూడా ఇచ్చారు. సుమారు పదిలక్షల విలువైన ఆభరణాలను తీసుకుని వారు వెళ్లిపోయిన తర్వాత షాపు యజమాని ప్రశాంత్ అక్కడకు వచ్చిన తర్వాత మహిళల వ్యవహారశైలిపై అనుమానం వచ్చి నగలను పరీక్ష చేయించగా అవి నకిలీవని తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాపుకాసి, వలపన్ని..
ఈఘటనపై రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు షాపులోని సీసీ ఫుటేజీతోపాటు దారిపొడువుగా సుమారు 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు 4 ఆటోలు మారుస్తూ శంషాబాద్ సమీపంలోని ఉందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని వీకర్ సెక్షన్ కాలనీకి చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు స్థానికులతో వాకబు చేయగా గదిలో ఉంటున్న వారు తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన బోయ రాధ(37), చెన్నయ్‌కి చెందిన ధన రాము(29)గా తేలింది.
దీంతో వారంరోజుల పాటు పోలీసులు అక్కడే కాపు కాశారు. రెండ్రోజుల క్రితం చెన్నయ్‌లో బంగారం అమ్మేసి మరో దొంగతనం చేయడం కోసం నగరానికి వచ్చిన బోయరాధ, ధన రామును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారితో పాటు ఆలకుంట్ల నాగసూరి (36) అనే వ్యక్తి వారికి సహాయంగా పనిచేసినట్లు తేలింది. బోయ రాధ గ్యాంగ్ రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే విధంగా ఆభరణాల దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడిందని తేలింది. తమపై ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన బట్టలు ధరిస్తుండడంతో పాటు కొన్నిసార్లు ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహిస్తుంటారని విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని చోరీలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.