Kandukuru | కందుకూరు, మార్చి 14 : పని జరిగే ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండుటెండలకు పనులు చేయలేక తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా వేసేవి కాలంలో సేద తీర్చడానికి టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ వీటన్నింటిని ఏర్పాటు చేయడం లేదని, అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీలు చస్తే చావని కానీ, తమకు ఎందుకులే అన్నట్లుగా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కనీసం తాగు నీటి సౌకర్యం కల్పించడం లేదన్నారు. తాగునీళ్లను కూడా ఇంటి వద్ద నుంచే తెచ్చుకుంటున్నామని కూలీలు వాపోయారు.
వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడంతో ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయం కూలీలను వెంటాడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలీల సేద తీర్చడానికి టెంట్లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రభుత్వం నిలిపి వేసింది. మెడికల్ కిట్లను పంపిణీ సైతం నిలిపి వేసింది. కిట్లలో దూది, అయోడిన్, బ్యాండేజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేవి. ప్రస్తుతం వాటన్నిటిని నిలిపివేయడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.
ఎండాకాలం కూలీలు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కూలీలు ఉదయం 11 గంటల వరకు పనులు ముగించుకోవాలి. తలకు ఎండ తగలకుండా టవల్ చుట్టుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. తెల్లటి కాటన్ దుస్తులు వేసుకోవాలి. ఎండకు వడదెబ్బకు గురైతే ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.
డాక్టర్ పద్మావతి, కందుకూరు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్
ఉపాధి హామీ కూలీలకు తాగునీరు సరఫరా చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించింది. పని ప్రదేశంలో నీడ కోసం ఏర్పాటు చేసే టెంట్లను ప్రభుత్వం నిలిపి వేసింది. పని ప్రదేశంలో మెడికల్ కిట్లను అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ప్రథమ చికిత్సకు అవసరమయ్యే సామాగ్రిని అందిస్తాం. ఎండల నుంచి రక్షణ కల్పించడానికి ఓఆర్ఎస్ పాకెట్లను అందజేస్తాం.
రవీందర్ రెడ్డి, ఏపీఎం కందుకూర్