రాముడి దయవల్ల భాగ్యనగరానికి కూకట్పల్లి కేంద్రం అయింది
ఆలయ పునః ప్రతిష్ఠమహోత్సవంలో త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి
బాలానగర్, ఏప్రిల్ 25 : కూకట్పల్లి కాదు..బంగారుపల్లి.. రాముడి దయ వల్ల భాగ్యనగరానికి కూకట్పల్లి కేంద్రం అయిందని త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి రామాలయంలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు, ఆలయ అధికారులు, వేదపండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో యంత్ర ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ద్వారం గుండా వెండి ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి, శిఖర విమాన గోపుర కలశం ప్రతిష్ఠ, బింబ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మిధున లగ్నం పుష్కరాంశమున ఉదయం 10:25 గంటలకు ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభ, కుంభ ప్రోక్షణ, ప్రధమారాధన, సర్వదర్శనం, శ్రీసీతారామచంద్రస్వామి వారి శాంతి కల్యాణ మహోత్సవాలను చినజీయర్‌స్వామి నిర్వహించారు.
అనంతరం భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆ శ్రీరాముడి సంకల్పంతోనే ఆలయ పునఃనిర్మాణ పనులను భుజాన వేసుకొని దాతలు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ఇంత అద్భుతంగా నిర్మించారని అభినందించారు. పూర్వకాలంలో దేవాలయం ఉంటే ఊరికి గుర్తింపు వచ్చేది. ఆ ఊరికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందేవన్నారు. ఆలయాల మధ్య అనుబంధం, సహకారం ఉండాలి కానీ పోటీ తత్వం కాదని ఆయన సూచించారు. అలాంటి సమాజం కోసం రామానుజ వారు 600 ఏండ్ల క్రితమే తగు సూచనలు చేశారు. దైవం మీలో ఉంటే సర్దుబాట్లు ఉంటాయి. అన్ని సుఖాలు ఉన్న ఇంట్లో బాధలు కూడా ఉన్నాయి. రామ ప్రేమలో బాధలన్నీ మరిచిపోయి అందరం కలిసి ఉంటున్నాం అని తెలిపారు.
ఆ శ్రీరాముడే నన్ను ప్రేరేపించాడు..
ఆ సీతారామచంద్రుల వారే ఆలయ పునః నిర్మాణం కోసం తనను ప్రేరేపించారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శాతాబ్దాల చరిత్ర కలిగిన కూకట్‌పలి సీతారామ చంద్రస్వామి ఆలయం తన చేతుల మీదుగా పునః నిర్మాణం కావడం.. స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు తన ఆధ్వర్యంలో జరుగడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు, గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తులసీరావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్‌గౌడ్, ఆవుల రవీందర్‌రెడ్డిలతో పాటు భక్తులు పాల్గొన్నారు.