కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 1 : కూకట్పల్లి నియోజకవర్గం గత ఎనిమిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి ఫలితంగా దీర్ఘకాలిక ప్రజా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సరఫరా, క్రీడాప్రాంగణాలు, పార్కుల అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టిని సారించిన ఎమ్మెల్యే కృష్ణారావు.. భవిష్యత్ అవరసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను పూర్తి చేయిస్తున్నారు. ఇప్పటికే వేలాది కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేయగా.. తాజాగా మరో రూ.28.51 కోట్లతో చేపట్టనున్న పనులకు నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేడు ఓల్డ్ బోయిన్పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్లలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ లు స్థాని కార్పొరేటర్లతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
బాలాజీనగర్ డివిజన్లో రంగధాముని (ఐడీఎల్) చెరువును ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృష్ణారావు సంకల్పించారు. దీనిలో భాగంగా మొదటి దశలో రూ.10 కోట్లతో రంగధాముని చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే బాలాజీనగర్ కాలనీలో నిరుపయోగంగా ఖాళీ స్థలాన్ని ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ సహకారంతో సీఎస్ఆర్లో భాగంగా రూ.2 కోట్లతో మహిళా పార్కుగా అభివృద్ధి చేసే పనులు నేడు ప్రారంభమవుతాయి. డివిజన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ భువనవిజయం గ్రౌండ్లో రూ.1.95 కోట్లతో అధునాతన వసతులతో ఇండోర్ షెటిల్ కోర్టు, చుట్టూరా ప్రహరీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాప్రాంగణాలను అభివృద్ధి చేసే దిశగా షెటిల్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టగా నేటినుంచి క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నది.
కేపీహెచ్‌బీ కాలనీలో అభివృద్ధికి నోచుకోని హిందూ శ్మశానవాటికను సకల వసతులతో కైలాసవాసంగా (మహాప్రస్థానంగా) తీర్చిదిద్దారు. రూ.3.23 కోట్లతో కైలాసవాసంలో దహనవాటికలు, పూజా గదులు, స్నానపు గదులు లాంటి చివరి మజిలీకి కావాల్సిన సకల సౌకర్యాలను కల్పించారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం.. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడంలో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లో రూ.1.50 కోట్లతో అధునాతన ఇండోర్ స్టేడియం కోర్టును అభివృద్ధి చేశారు. ఈ ఇండోర్ షెటిల్ కోర్టు నేడు మంత్రి చేతులు మీదుగా ప్రారంభమవుతుండడంతో క్రీడాకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది భారీగా కురిసిన వర్షాలతో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ ముంపు సమస్యను నివారించే దిశగా రూ.5.50 కోట్లతో అలా కాంప్లెక్స్ నుంచి ఆర్ఆర్నగర్ వరకు స్ట్రామ్ వాటర్ బాక్స్ డ్రైనేజీ (వర్షంనీటి కాలువలను) ఆధునీకరించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మానససరోవరం జంక్షన్లో వర్షం నీటి కాలువపై రూ.1.92 కోట్లతో కల్వర్ట్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. అలాగే హస్మత్‌పేట చెరువు సుందరీరకరణలో భాగంగా రూ.2.56 కోట్లతో చెరువుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులతో ముంపు ప్రాంతాల్లో సమస్యలు దాదాపుగా తీరుతాయని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేటీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎనిమిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో వేలాది కోట్ల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులను చేశాం. మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వర్షంనీటి కాలువలు, చెరువుల అభివృద్ధి, పార్కులు, క్రీడాప్రాంగణాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎక్కడా లేని విధంగా క్రీడా ప్రాంగణాలను, పార్కులు, చెరువులను సుందరీకరిండం జరుగుతుంది. కూకట్పల్లి అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్పల్లి