సిటీబ్యూరో,సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కూకట్పల్లి నల్లచెరువు బాధితుల గోడు వర్ణనాతీతం. హైడ్రా కూల్చివేతల్లో బతుకుదెరువు కోల్పోయి రోడ్డున పడ్డ సామాన్యుడి జీవనచిత్రమిది. రెక్కాడితేకానీ డొక్కాడని బడుగుజీవుల జీవితాలపై హైడ్రాబుల్డోజర్ పంపి వారి బతుకును ఛిద్రం చేసింది. ఆదివారం నల్లచెరువులో జరిగిన కూల్చివేతల తర్వాత మంగళవారం రోజు ‘నమస్తే తెలంగాణ’కు కనిపించిన దృశ్యాలివి.
ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్నా లెక్కచేయక శిథిలాల మధ్య తమ సామగ్రిని వెతుక్కుంటూ బతుకుజీవుడా అంటూ తరలించుకుపోతున్నారు బాధితులు. హైడ్రా కూల్చివేతల్లో అడుగడుగునా తమ బతుకులు ఆగమైతాయని కాళ్లావేళ్లా పడ్డా బాధితులను కనికరించని అధికార కర్కశత్వపు తాలూక ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తూనే ఉన్నాయి. రెండురోజుల క్రితం కూల్చివేతల్లో రేకుల షెడ్లు నేలమట్టం కాగా..
వాటిలో మిగిలిన సామానును, రేకులను మోసుకుంటూ ట్రాలీలు, లారీల్లో మరోచోటకు తరలించుకువెళ్లే క్రమంలో వానలో, బురదలో వారి సామాను చిందరవందరగా పడేసిన తీరును చూసి ప్రతి ఒక్కరూ గుండెపగిలేలా రోధిస్తున్నారు. తమ బతుకులు ఎలా బాగుపడాలా అని ఆవేదన చెందుతూ సర్కార్ తీరును నిరసిస్తూ శాపనార్థాలు పెడుతున్నారు. టెంట్‌హౌజ్ సామగ్రి కూల్చివేతల్లో దెబ్బతినగా.. మిగిలిన కొంతను తమతో తీసుకెళ్తున్నారు . అసలు నల్లచెరువు కూల్చివేతల దృశ్యాలు చూస్తే భూకంపం వచ్చిన తర్వాత ఆ ప్రాంతమంతా ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా సాక్ష్యంగా కనిపిస్తోంది.