సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): యాకుత్ఫురాలో బాలిక పాఠశాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఘటనకు కారణం తామేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఘటనకు బాధ్యులను చేస్తూ హైడ్రా అఫీషియల్ గ్రూపులో మొదట బల్దియా బాధ్యులను చేస్తూ ప్రకటన విడుదల చేశారు. తిరిగి ఆ ప్రకటనను రెండుమూడు నిమిషాల్లోనే డెలిట్ చేసి ఆ తర్వాత జలమండలి బాధ్యులంటూ ప్రకటించారు.
ఇలా గ్రూపులో చేసిన ప్రకటనలు అందరిలో సందిగ్ధాన్ని పెంచాయి. అసలు ఘటనకు బాధ్యులెవరన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో శుక్రవారం అధికారులతో సమావేశమైన రంగనాథ్ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను ఆరాతీశారు. యాకుత్‌పురా డివిజన్ మౌలాకాచిల్లాలోని మ్యాన్‌హోల్‌లో గురువారం ఉదయం చిన్నారి పడిపోయింది. ఆ చుట్టుపక్కల నాలుగైదు మ్యాన్‌హోల్స్ ఉన్నాయని, అందులో ఒకటి వాటర్‌బోర్డు వాళ్లు క్లీన్ చేశారని రంగనాథ్ చెప్పారు. ఘటన జరిగిన మ్యాన్‌హోల్ మాత్రం హైడ్రా సిబ్బంది క్లీన్ చేశారని ఆయన పేర్కొన్నారు.
ఇతర శాఖలతో తమకు చిన్నచిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు ఏమీ లేవని చెప్పారు. అంతకుముందు ఈ ఘటనకు బాధ్యులు జీహెచ్ఎంసీ అని, ఆ తర్వాత వారు ప్రకటన విడుదల చేయగానే జలమండలి అంటూ హైడ్రా ప్రకటనలు విడుదల చేసింది. దీంతో ఆ రెండుశాఖలు ఘటనకు తాము బాధ్యులం కాము అంటూ ప్రకటించడంతో పాటు హైడ్రా ఇటువంటి పనులు చేపట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యాకుత్‌పురా మ్యాన్‌హోల్ ఘటనకు సంబంధించి బ్లేమ్‌గేమ్ ఆడొద్దంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర శాఖలను టార్గెట్ చేసుకుని చేసిన ప్రకటనపై ఆ శాఖల అధికారులు మండిపడ్డారు. తమకు సంబంధం లేకుండానే తమనే బ్లేమ్ చేసి తిరిగి బ్లేమ్‌గేమ్ ఆడొద్దంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ఘటనకు కారణమెవరన్న విషయంలో హైడ్రా, జలమండలి, జీహెచ్ఎంసీల మధ్య జరిగిన ఈ ప్రకటనల యుద్ధంలో చివరకు హైడ్రాదే తప్పని తేలింది.
జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసుల్లో హైడ్రా వల్లే తప్పు జరిగిందంటూ పేర్కొంటూ మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. అయితే జలమండలి వల్లే తప్పు జరిగిందంటూ హైడ్రా కౌంట ర్ ఇవ్వడంతో మ్యాన్‌హోల్ నిర్లక్ష్యానికి తమకు సంబంధం లేదంటూ జలమండలి ఉన్నతాధికారులు ప్రకటించారు. శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఎంఈటీ సిబ్బంది మూతవేయడం మరిచిపోవడం వల్లే చిన్నారి పడిపోయిందని, ఇందుకు కారణం తామే అంటూ హైడ్రా ఒప్పుకుంది. మళ్లీ రంగనాథ్ తమ ప్రకటనల్లో బ్లేమ్‌గేమ్ వద్దంటూ ప్రకటించడంపై జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు మండిపడుతున్నారు.
సిల్ట్‌ను తొలగించేందుకు తెరిచిన మ్యాన్‌హోల్ మూయకపోవడంతో ఈ ఘటన జరిగిందని రంగనాథ్ చెప్పారు. ఇద్దరు డీఆర్ఎఫ్ సూపర్వైజర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు చెందిన ఇద్దరి నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నిర్ధారించారు. డీఆర్ఎఫ్ సూపర్వైజర్లకు డిమోషన్ ఇవ్వగా, మెట్ సిబ్బందికి చెందిన ఇద్దరిని తొలగించాలంటూ మెట్ టీమ్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్కారు నడుపుతున్నదా? సర్కస్ నడుపుతున్నదా? అని ప్రశ్నించారు.
మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనలో తప్పులు సరిదిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాల అధికారులు ఒకరిపై మరొకరూ దుమ్మెత్తిపోసుకోవడం విడ్డూరమన్నారు. మున్సిపల్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ శాఖను కాసుల వేటకు వాడుకోవడంలో బిజీగా ఉంటే.. ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపుతున్నాయన్నారు.